సమస్యాత్మక గ్రామాల్లో ప్రత్యేక దృష్టి
సిసి కెమెరాలు, వెబ్‌కాస్టింగ్ ద్వారా పరిశీలన
నేటి రెండో విడతలో వంద పంచాయితీల్లో ఎన్నికలు
జగిత్యాల,జనవరి24(జనంసాక్షి): జిల్లాలో శుక్రవారం జరగనున్న రెండోవిడత గ్రామపంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 7గంటలకు పోలింగ్ మొదలై 1గంటకు ముగియనుంది. 2గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతారు. రెండో విడతలో ఎన్నికలు జరిగే పంచాయతీల్లో సమస్యాత్మకం, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. ఆయా కేంద్రాల్లో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు 58 వెబ్ కాస్టింగ్, సీసీ కెమెరాల ద్వారా పోలింగ్ సరళిని ఎన్నికల అధికారులు పరిశీలించనున్నారు. 24 పంచాయతీల్లో సూక్ష్మ పరిశీలకులను నియమించారు. 73 సాధారణ, 60 సమస్యాత్మకం, 45 అతి సమస్యాత్మక, 18 క్రిటికల్ కేంద్రాలను గుర్తించారు. ఆరుగురు సీఐలు, 28 మంది ఎస్సైలతోపాటు 750 మంది సిబ్బంది బందోబస్తు నిర్వహించనున్నారు. ఎన్నికలు జరిగే గ్రామాల్లో 18 సమస్యాత్మక, 45 అత్యంత సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించారు. 26 జోన్లు, 44 రూట్లుగా విభజించి ఎన్నికల అధికారులు, సిబ్బందిని కేటాయించారు. గురువారం మధ్యాహ్నం వరకే ఎన్నికల సిబ్బంది బ్యాలెట్ బాక్సులు, పత్రాలు, సామగ్రితో పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లేందుకు ఏర్పాట్లు చేసినట్లు జిల్లా పంచాయతీ అధికారి కె.లక్ష్మినారాయణ చెప్పారు. రెండోవిడత ఎన్నికలు జరిగే గ్రామపంచాయతీల్లో మేడిపల్లి మండలం మన్నెగూడెం, పసునూరు, కమ్మరిపేట, ఒడ్డాడ్, కథలాపూర్ మండలంలో అంబారిపేట, రాజారంతండా, కోరుట్ల మండలంలో మాదాపూర్, తిమ్మాయిపల్లి, సర్పరాజ్‌పూర్, మెట్‌పల్లి మండలంలో కేసీఆర్ తండా, పాటివిూది తండా, అల్లూరి సీతారామరాజు తండా, చింతలపేట, రామారావుపల్లి, రాంలచ్చక్కపేట, వెంపేట్, ఇబ్రహీంపట్నంలో ఎర్రాపూర్, తిమ్మాపూర్ తండా, మల్లాపూర్ మండలంలో మల్లాపూర్, హుస్సేనీనగర్, వాల్గొండ తండా, గుండంపల్లి గ్రామపంచాయతీలు ఏకగీవ్రమయ్యాయి. మేడిపల్లి, కథలాపూర్, కోరుట్ల, మెట్‌పల్లి, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ మండలాల్లో 122 గ్రామ పంచాయతీలుండగా 22 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా 100 సర్పంచి పదవులకు ఎన్నికలు జరగనుండగా 426 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 1172 వార్డులకు 395 ఏకగ్రీవం కాగా 776 వార్డులకు 1983 మంది పోటీ పడుతున్నారు. ఏకగ్రీవ పంచాయతీలను మినహాయిస్తే మిగతా వంద పంచాయతీల్లో దాదాపు 2839 మంది పోలింగ్ విధులు నిర్వహించనున్నారు. ఎన్నికల కోసం 44 రూట్లను విభజించి 26 మంది జోనల్ అధికారులను నియమించారు. పోలింగ్ సిబ్బందిని గ్రామాలకు తీసుకెళ్లడానికి 86 బస్సులు, 41 జీపులు, కార్లు ఏర్పాటు చేశారు.