సమ్మక్క-సారలమ్మ జాతరకు పక్కాగా ఏర్పాట్లు : మంత్రులు సత్యవతి, ఇంద్రకరణ్‌ రెడ్డి

సమ్మక్క-సారలమ్మ జాతరకు పక్కాగా ఏర్పాట్లు : మంత్రులు సత్యవతి, ఇంద్రకరణ్‌ రెడ్డి

కుంభమేళాను తలపించే సమ్మక్క-సారలమ్మ అతి పెద్ద గిరిజన జాతరకు వచ్చే కోట్లాది మంది భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు ప్రణాళిక బద్ధంగా ఉండాలని మంత్రులు సత్యవతి రాథోడ్, ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. జిల్లా పర్యటన నేపథ్యంలో మంత్రులు గట్టమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జిల్లా కేంద్రంలో 15 లక్షల అంచనా విలువతో నిర్మించిన జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయ భవనాన్ని వారు ప్రారంభించారు.ఆ తర్వాత ములుగు ఇంచర్ల గ్రామంలో రూ.5 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల (బాలుర) అదనపు భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. తాడ్వాయి మండలంలోని శ్రీ సమ్మక్క- సారలమ్మ అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమ్మవార్ల ఆలయ సమీపంలో రూ. 2 కోట్ల 15 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న గృహ సముదాయ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.ఆ తర్వాత ఐటీడీఏ గెస్ట్ హౌస్‌లో నిర్వహించిన శ్రీ సమ్మక్క, సారలమ్మ 2024 మహాజాతర ఏర్పాట్ల పై అధికారులతో మంత్రులు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..జాతరలో డ్రింకింగ్ వాటర్, టాయిలెట్స్, విద్యుత్‌ శాఖ, రోడ్లు మరమ్మతుల పై రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించిన విషయాన్ని తెలియ జేశారు.సీఎం కేసీఆర్ ఆదేశాలతో మేడారం జాతరను ప్రతి ఏడాది ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. మేడారం జాతర అభివృద్ధి పనులకు 80 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్టు తెలిపారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి సూచించారు. జాతర పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.ఇప్పటి వరకు రూ.400 కోట్లతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామని, ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగే మహా జాతరకు అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. భారీ వర్షాల కారణంగా కొంతమేర రోడ్లు దెబ్బ తిన్నాయని ఆయా పనులను వేగంగా పూర్తి చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ బడే నాగజ్యోతి, రెడ్ కో చైర్మన్ సతీష్ రెడ్డి, రాష్ట్ర రహదారుల అభివృద్ధి సంస్థ కార్పొరేషన్‌ చైర్మన్‌గా మెట్టు శ్రీనివాస్‌, రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్ల బుచ్చయ్య, బీఆర్‌ఎస్‌ ములుగు జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్‌రావు, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఐటిడిఏ పిఓ అంకిత్, తదితరులు పాల్గొన్నారు.