సమ్మె విరమించండి

2

– ఉదయం కల్లా విరమించాలి: హైకోర్టు

– సమ్మె యధాతథంగా కొనసాగుతుంది

– కార్మిక సంఘాలు

హైదరాబాద్‌,మే12(జనంసాక్షి):

ఆర్టీసీ కార్మికుల సమ్మెపై హైకోర్టు మరోమారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణం సమ్మె విరమించాలని ఆదేశించింది. సమ్మె విరమణకు కార్మికులకు డెడ్‌లైన్‌ విధించింది. బుధవారం ఉదయం 10.30 లోపు సమ్మె విరమించని పక్షంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలను ఆదేశిస్తామని హైకోర్టు ధర్మాసనం కార్మికులను హెచ్చరించింది. మంగళవారం నాడు ఆర్టీసీ కార్మికుల సమ్మెపై వేసిన పిటీషన్‌పై ధర్మాసనం విచారణ చేపట్టింది. దీనిపై వాదనలు విన్న ధర్మాసనం ఏ నిబంధనల ప్రకారం సమ్మె చేస్తున్నారని ఆర్టీసీ కార్మిక సంఘాలను ప్రశ్నించింది. ఈ సమ్మె చట్ట విరుద్ధమైనది వ్యాఖ్యానించింది. ఆర్టీసీ ఉద్యోగులంతా ప్రభుత్వంలో భాగమేనన్న న్యాయస్థానం సమ్మెను నిషేధిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను కార్మికులు పరిగణనలోకి తీసుకోవాలని, తక్షణమే సమ్మెను విరమించాలని ఆదేశించింది. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. కోర్టు ధిక్రణ కింద చర్యుల తీసుకుంటామన్నారు. అదేవిధంగా సమ్మె విరమిస్తే కార్మికుల డిమాండ్లపై 2 వారాల్లోగా చర్యలు తీసుకోవాలని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలను ఆదేశిస్తామని కార్మిక సంఘాలకు హైకోర్టు భరోసా ఇచ్చింది.మరోవైపు కార్మికుల సంఘాలు కూడా తమ వాదనను కోర్టులో బలంగా వినిపించాయి. చట్టబద్దంగానే సమ్మె చేస్తున్నామని, నోటీసులు ఇచ్చిన తరువాతే సమ్మెకు వెళ్లామని స్పష్టం చేశాయి. ఆర్టీసీ ఆఫీసులన్నీ హైదరాబాద్‌లోనే ఉన్నాయని, సమ్మెను నిషేధిస్తూ ఏపీ ప్రభుత్వం ఇచ్చిన నోటీసులు తమకు వర్తించవని కార్మికులు తేల్చి చెప్పారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో కార్మిక సంఘాలు స్పందించాయి. 43 ఫిట్‌మెంట్‌ను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ తాము చేపట్టిన సమ్మె చట్టానికి లోబడి చేస్తున్నదేనని ప్రకటించాయి. సమ్మె అంశంపై  ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలతో మాట్లాడిన తర్వాతనే భవిష్యత్‌ కార్యాచరణను ప్రకటిస్తామని కార్మిక సంఘాల నేతలు వెల్లడించారు. కార్మికులు సమ్మెను విరమిస్తారో లేదో తేల్చి చెప్పాలని కోర్టు గడువు ఇచ్చిన సంగతి తెలిసిందే