సమ్మె విరమించండి తక్షణం విధుల్లోకి చేరండి

3

– ఆర్టీసి కార్మికులకు హైకోర్డు హుకుం

హైదరాబాద్‌,మే 9(జనంసాక్షి): తమ సమస్యల పరిష్కారం కోసం నాలుగు రోజులుగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు ఉన్నత న్యాయస్థానం ఝలక్‌ ఇచ్చింది. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సమ్మె చట్ట విరుద్ధమని ప్రకటించింది. తక్షణం డ్యూటీలో చేరాలని కార్మికులను ఆదేశించింది. గత నాలుగు రోజులుగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెపై హైకోర్టులో దాఖలైన హౌస్‌మోషన్‌ పిటిషన్‌పై జస్టిస్‌ జేసీభాను విచారణ చేపట్టారు.  ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కార్మికులు తక్షణమే విధుల్లోకి హాజరుకావాలని హైకోర్టు ఆదేశించింది. సమ్మె వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, సమ్మె వంటి చర్యలు సహేతుకం కాదని స్పష్టం చేసింది. ఈ అంశంపై తదుపరి విచారణను హైకోర్టు ఈనెల 12కు వాయిదా వేసింది. ఆర్టీసీ సమ్మెను వ్యతిరేకిస్తూ ఎంసీఐ మాజీ సభ్యుడు సీఎల్‌ వెంకట్‌రావు, చిత్తూరు జిల్లా వాసి మహ్మద్‌గౌస్‌ వేర్వేరుగా హైకోర్టులో హౌస్‌మోషన్‌ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని పిటిషనర్లు కోర్టు దృష్టికి తెచ్చారు. తమ వ్యాజ్యాలలో ఆర్టీసీ యాజమాన్యం, యూనియన్‌ నేతలు, రెండు రాష్ట్రాల సీఎస్‌లను ప్రతివాదులుగా చేర్చారు. ఈ పిటిషన్‌పై విచారించిన హైకోర్టు సమ్మెపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కార్మికులంతా తక్షణం విధుల్లో చేరాలని హైకోర్టు ఆదేశించింది. రెండు రాష్ట్రాల్లో సమ్మెపై నిషేధం ఉందని.. ఈ సమయంలో సమ్మె చేయడం అత్యవసర సేవలకు భంగం కలిగించినట్లేనని కోర్టు అభిప్రాయపడింది. కార్మికులంతా తక్షణం విధుల్లో చేరాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ… తదుపరి విచారణను 12వ తేదీకి వాయిదా వేసింది.

ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా బస్సులు తిరగక ప్రజలు, విద్యార్థులు, రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కోర్టుకు నివేదించినట్లు పిటిషనర్‌ తరపు న్యాయవాది తెలిపారు. తమ వాదనను విన్న న్యాయస్థానం ముందుగా కార్మికులను విధుల్లో చేరాలని ఆదేశించిందని… కార్మికుల డిమాండ్లు న్యాయబద్ధంగా ఉన్నాయా? లేదా? అన్న దానిపై తదుపరిలో విచారణలో కోర్టు పరిశీలిస్తుందని చెప్పారు.

ఆర్టీసీ కార్మికులు తక్షణం విధుల్లో చేరాలని ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలపై కార్మిక సంఘాలు ఆలోచనలో పడ్డాయి. కార్మిక నేతలు మాట్లాడుతూ న్యాయస్థానం ఆదేశాల ప్రతిని చూశాకే దీనిపై స్పందిస్తామని స్పష్టం చేశారు. హైకోర్టు తీర్పుతో షాక్‌ కు గురయ్యామని టీఈయూ నేత అశ్వత్థామరెడ్డి అన్నారు. కోర్టు తీర్పును గౌరవిస్తామని ఆయన చెప్పారు. కోర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్లడం లేదా విధుల్లో చేరే అంశాలపై ఆలోచిస్తామని ఆయన అన్నారు. హైకోర్టు జడ్జిమెంట్‌ కాపీ తమకు ఇంకా అందలేదని ఆర్టీసీ టీఎంయూ, ఈయూ నేతలు తెలిపారు. చట్టప్రకారం సమ్మె నోటీస్‌ ఇచ్చి సమ్మెకు వెళ్లామని పేర్కొన్నారు. సమ్మె యథాతథంగా కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు.