సరికొత్త నిరసన..చెత్తపోశారు..
నిరసన తెలిపిన లబ్ధిదారులు
కృష్ణా జిల్లా ఉయ్యూరులో ఘటన
ఉయ్యూరు,డిసెంబరు 24 (జనంసాక్షి):ప్రభుత్వ పథకాలకు రుణాలు మంజూరు చేయడంలో బ్యాంకులు అలసత్వం ప్రదర్శిస్తున్నాయని ఆగ్రహంతో ఉన్న లబ్ధిదారులు వినూత్న రీతిలో నిరసనకు దిగారు. రుణాల మంజూరుపై ఎన్నిసార్లు బ్యాంకు మేనేజర్లతో మాట్లాడినా రుణాలు ఇవ్వకపోగా.. సరైన రీతిలో సమాధానాలు ఇవ్వడం లేదని ఆరోపించారు. కృష్ణా జిల్లా ఉయ్యూరులో నగర పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు బ్యాంకుల ముందు చెత్తవేసి తమ అసహనాన్ని వ్యక్తపరిచారు. రాష్ట్ర ప్రభుత్వ తీసుకొచ్చిన జగనన్న తోడు, వైఎస్ఆర్ చేయూత వంటి పథకాలకు ఉయ్యూరులోని వాణిజ్య బ్యాంకులు రుణాలు మంజూరు చేయడం లేదని.. లబ్ధిదారులతోపాటు నగర పంచాయతీ సిబ్బందితో అవహేళనగా మాట్లాడుతున్నారని ఆరోపిస్తూ ఆయా బ్యాంకుల కార్యాలయాల వద్ద చెత్తను పారబోశారు. రుణాల మంజూరు విషయంలో ఉయ్యూరు నగర పంచాయతీ కమిషనర్ డా. ప్రకాశ్ పలుమార్లు ఆయా బ్యాంకుల మేనేజర్లతో మాట్లాడినా ఫలితం లేకపోయిందని.. అందుకే ఇలాంటి నిరసనకు దిగినట్లు లబ్ధిదారులు తెలిపారు.
అరాచకానికి నిదర్శనం: ఏఐబీఈఏ
ఉయ్యూరులో బ్యాంకుల ముందు చెత్త వేసిన ఘటనపై బ్యాంకు ఉద్యోగుల సంఘం (ఏఐబీఈఏ) స్పందించింది. స్థానిక యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందు చెత్త వేయడాన్ని ఏఐబీఈఏ తీవ్రంగా ఖండించింది. ఇలా బ్యాంకుల ముందు చెత్త వేయడం అరాచకానికి నిదర్శనమని వ్యాఖ్యానించింది. బ్యాంకులను లక్ష్యంగా చేసుకోవడం ఎక్కడా జరగలేదని.. స్వయంగా మున్సిపల్ అధికారులే దగ్గరుండి చెత్త వేయించడం దారుణమని ఏఐబీఈఏ ఆరోపించింది.