సరిహద్దుల్లో అధునాతన రక్షణ వ్యవస్థ

ఇక నిరంతరాయంగా నిలబడి పహారా కాయాల్సిన పనిలేదు
బికనీర్‌లో బీఎస్‌ఎఫ్‌ జవాన్లను ఉద్దేశించి మాట్లాడిన రాజ్‌నాథ్‌
జయపుర,అక్టోబర్‌19(జ‌నంసాక్షి): సరిహద్దుల్లో 24 గంటల పాటు నిల్చొని సైనికులు ఇకనుంచి పహారా కాయాల్సిన పనిలేదని కేంద్ర ¬ం శాఖ మంత్రి రాజనాథ్‌ సింగ్‌  అన్నారు. దానికి బదులుగా భారత్‌ కొత్త సాంకేతిక పరిష్కార మార్గాలను అందుబాటులోకి తీసుకురానుందని అన్నారు. బికనీర్‌లో బీఎస్‌ఎఫ్‌ జవాన్లను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. అధునాతన సరిహద్దు నిర్వహణ వ్యవస్థను కేంద్రం అమలు చేయనుందని, దానిద్వారా సరిహద్దు భద్రత మరింత పెరుగుతుందని వెల్లడించారు. ఇందుకు సంబంధించిన పైలట్‌ ప్రాజెక్టు జమ్మూలో మొదలు పెట్టామని తెలిపారు. దసరా సందర్భంగా నిర్వహించిన పూజ అనంతరం వారితో ఆయన సమావేశమయ్యారు. బికనీర్‌ ఆర్మీ క్యాంప్‌ను కేంద్ర ¬ంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సందర్శించారు. అక్కడ జరిగిన ఆయుధ పూజలో పాల్గొన్నారు. బికనీర్‌ ఆర్మీ క్యాంప్‌లో భారీ తుపాకులు, ఆటోమెటిక్‌ గన్లకు పండితులు శాస్తోక్తంగా పూజలు నిర్వహించారు. రాజ్‌నాథ్‌ సింగ్‌ స్వయంగా ఈ క్రతువులో పాలుపంచుకున్నారు. దసరా సందర్భంగా ఆయుధాలకు పూజలు నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఇదే ఆనవాయితీని బీఎస్‌ఎఫ్‌ జవాన్లు ఏటా పాటిస్తున్నారు. ఈ ఏడాది రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆయుధ పూజలో పాల్గొనడం విశేషం. ‘కొంతకాలం తరవాత సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన ఫెన్సింగ్‌ పాడైపోతుంది. దాని స్థానంలో ఈ కొత్త వ్యవస్థను ఏర్పాటు చేస్తాం. ఈ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడానికి ఇంకొంత సమయం పడుతుంది. కానీ జవాన్లు 24 గంటలు నిల్చొనే అవస్థ తప్పుతుంది. కమాండ్‌ కంట్రోల్‌ వ్యవస్థ ద్వారా సరిహద్దుల్లో జరిగే కార్యకలాపాలను గమనించొచ్చు. చొరబాటు దారులు చొచ్చుకొని వస్తున్నారని తెలియగానే భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేయొచ్చని కొత్త సాంకేతికత గురించి ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా బీఎస్‌ఎఫ్‌ జవాన్ల ధైర్యసాహసాలను కొనియాడారు. పొరుగు దేశం ఆయుధాలు వాడటం మానితే మనకు వాటిని వాడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
అలాగే దసరా పండగ ప్రాముఖ్యాన్ని ఆయన వివరించారు. ‘రాముడు కంటే రావణుడు ధనవంతుడు, శక్తిమంతుడు. కానీ వ్యక్తిత్వం కారణంగా రాముడు పూజనీయుడిగా మారాడు. అదే ఇద్దరికీ తేడా’ అని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సీనియన్‌ బీఎస్‌ఎఫ్‌ అధికారులు కూడా పాల్గొన్నారు.