సరి – బేసి…హైకోర్టు వ్యాఖ్యలు..

6ఢిల్లీ : దేశ రాజధానిలో వాయు కాలుష్యం సమస్యకు పరిష్కారానికి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ప్రారంభించిన సరి-బేసి కార్ల విధానానికి ఢిల్లీ హైకోర్టు నుంచి ఊహించని విధంగా చుక్కెదురైంది. ఈ ట్రయల్‌రన్‌ ప్రారంభించి ఇప్పటికే ఆరు రోజులు పూర్తయిందని దీనివల్ల అనేక ఇబ్బందులు తలెత్తాయని ప్రజల నుంచి ఫిర్యాదులు అందినట్టు హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రజా రవాణాకు సరైన ఏర్పాట్లు చేయకుండా సరి-బేసి విధానాన్ని 15 రోజులు పాటించడం సరికాదని న్యాయస్థానం అభిప్రాయపడింది.ఈ ట్రయల్ రన్‌ను 15 రోజులకు బదులు వారం రోజులకే ఎందుకు పరిమితం చేయకూడదని కేజ్రీవాల్‌ సర్కార్‌ను కోర్టు ప్రశ్నించింది. కొంతమంది న్యాయమూర్తులు కార్‌ పూల్‌ చేసుకుని వస్తున్నారని, మరికొందరు కోర్టుకు నడచి రావడం మంచిదే…కానీ వారి ఫైళ్లు ఎలా వస్తాయి ? ఎవరు తీసుకొస్తారన్నది ప్రాక్టికల్‌గా ఆలోచించాల్సిన విషయమని కోర్టు పేర్కొంది.

8వ తేదీన నివేదిక సమర్పించాలన్న కోర్టు..
ఆప్‌ సర్కార్‌ దీన్నో ప్రాజెక్ట్‌ పైలెట్‌గా తీసుకున్నందున మరో రెండు రోజులు అవకాశం ఇస్తామని హైకోర్టు పేర్కొంది. కొత్త ట్రాఫిక్‌ రూల్‌ వల్ల ఎంతవరకు ప్రయోజనం ఒనగూరిందన్నదానిపై జనవరి 1 నుంచి నగరంలో నమోదైన కాలుష్యం వివరాలను జనవరి 8 శుక్రవారంలోగా కోర్టుకు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నివేదికని బట్టి సరి-బేసి విధానం ఏ మాత్రం సానుకూల ప్రభావం చూపిందో తెలుస్తుందని న్యాయస్థానం పేర్కొంది. ఆడ్‌ ఈవెన్‌ ట్రాఫిక్‌ రూల్‌ వల్ల నగరంలోని గాలిలో ఇంప్రూవ్‌మెంట్‌ ఉందని, దీనికి సంబంధించిన అన్ని వివరాలను శుక్రవారం కోర్టుకు సమర్పిస్తామని ఆప్‌ ప్రభుత్వం తెలిపింది.