సర్కారీ గుడుంబా వుండదు

2
– కల్తీ కల్లుపై ఉక్కు పాదం మోపండి

– సీఎం కేసీఆర్‌ ఆదేశాలు

హైదరాబాద్‌ జూన్‌15(జనంసాక్షి):

సారా దుకాణాలను తెరవాలన్న ఆలోచనను తెలంగాణ సర్కారు వెనక్కి తీసుకుంది. మద్యం నూతన విధానంపై సచివాలయంలో మంత్రి పద్మారావు, అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ… గుడుంబాను అరికట్టేందుకు కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. నెలాఖరులోగా మద్యం నూతన విధానాన్ని ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ాకధరకు మద్యాన్ని అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

రాష్ట్రం నుంచి గుడుంబా మహమ్మారిని తరిమివేయాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. దీనికోసం కఠిన విధానాన్ని రూపొందించాలన్నారు. మద్యం పాలసీపై సచివాలయంలో సవిూక్ష జరిపిన సీఎం కేసీఆర్‌.. గుడుంబా, కల్తీకల్లుతో జరుగుతున్న అనర్థాలను వివరించారు. జిల్లాల పర్యటన సందర్భంగా బస్తీల్లో తిరిగినప్పుడు ప్రతిచోటా గుడుంబాపై తనకు ఫిర్యాదులు అందాయని సీఎం కేసీఆర్‌ తెలిపారు. ఎలాగైన గుడుంబాను అరికట్టాలని మహిళలు వేడుకున్నారని గుర్తుచేశారు. గుడుంబా కారణంగా 20-25 ఏళ్ల యువతులు వితంతువులుగా మారడం తనను కలచి వేసిందన్నారు. సంక్షేమ కార్యక్రమాలు ఎన్ని అమలు చేస్తున్నా.. గుడుంబా వల్ల కుటుంబాల్లో సుఖసంతోషాలు లేకుండా పోతున్నాయన్నారు సీఎం కేసీఆర్‌.గుడుంబా మహమ్మారిని సమర్థవంతంగా అరికట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. దీనికోసం కఠిన చట్టాలు తేవాలా లేక పీడీ యాక్టును అమలు చేయాలా అనేదానిపై దృష్టి పెట్టాలని సూచించారు. నూతన ఎక్సయిజ్‌ పాలసీ రూపొందించడంలో గుడుంబాను అరికట్టడం ప్రధాన అంశమని తెలిపారు. కల్తీమద్యంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి అక్రమంగా రవాణా అవుతున్న లిక్కర్‌ పై అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. తనిఖీలను ముమ్మరం చేసి.. గూడ్స్‌ రవాణా వాహనాలపై నిఘా పెట్టాలని సూచించారు. కల్తీ కల్లు కంటే కల్తీ మద్యం పై ఎక్కువ ఫిర్యాదులు ఉన్నాయని సీఎం కేసీఆర్‌ తెలిపారు.

ఇక మెట్రోపాటిటన్‌ సిటీ అయిన హైదరాబాద్‌ కు దేశవిదేశాల నుంచి వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు ఎక్కువగా వస్తుంటారు కాబట్టి.. స్టార్‌ ¬టళ్లలో విదేశీ మద్యం అందుబాటులో ఉండాలని సీఎం సూచించారు. రాష్ట్రంలో ఇన్వెస్ట్‌ చేయడానికి వచ్చే పెట్టుబడిదారుల దృష్టిలో మంచిగా ఉండాలన్నారు సీఎం కేసీఆర్‌. వైన్‌ షాపులు, బార్ల నిర్వహణ విషయంలో మరింత జాగ్రత్తగా వ్వవహరించాలన్నారు. రోడ్లపై మద్యం తాగడాన్ని అరికట్టాలని అధికారులను ఆదేశించారు.

రాష్ట్రంలో అమ్ముడయ్యే లిక్కర్‌ ను ఇక్కడే తయారు చేసేలా చర్యలు తీసుకోవాలని సీఎం చెప్పారు. దీనికోసం అవసరమైన బేవరెజెస్‌ ను నెలకొల్పాలని సూచించారు. హైదరాబాద్‌ తో పాటు ఇతర నగరాలు, పట్టణాల్లో ఫ్లోటింగ్‌ పాపులేషన్‌ ను అంచనా వేసి.. దానికి అనుగుణంగా వైన్‌ షాపులు, బార్లు ఉండేలా చూడాలని అధికారును ఆదేశించారు సీఎం కేసీఆర్‌. ఎక్సైజ్‌ మంత్రి పద్మారావు, సీఎస్‌ రాజీవ్‌ శర్మ, సీఎంఓ ప్రత్యేక కార్యదర్శి నర్సింగరావుతో పాటు పలువురు ఉన్నతాధికారులు సవిూక్షలో పాల్గొన్నారు.