సర్కారు నిర్లక్ష్యం వల్లే పసిమొగ్గలు రాలుతున్నాయి
పద్నాలుగు ఉండాల్సిన చోట నాలుగు వెంటిలేటర్లా ?
ఎంజీఎం సందర్శనకు వచ్చిన మంత్రులకు చుక్కలు చూపెట్టిన జూడాలు
ఇకనైనా తెలంగాణపై నిర్లక్ష్యం వీడండంటూ మంత్రుల ఘెరావ్‌వరంగల్, ఆగస్టు 26 (జనంసాక్షి) : తెలంగాణకే తలమానికమైన వరంగల్ మహాత్మ గాంధీ మెమోరియల్ ఆస్పత్రిలో జరుగుతున్న శిశు మరణాలపై తనిఖీకి వచ్చిన మంత్రులు కొండ్రు మురళి, రాంరెడ్డి వెంకటరెడ్డి, బస్వరాజు సారయ్య, ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డిలకు చుక్కెదురైంది. వారిని జూనియర్ డాక్టర్లు అడ్డుకుని తీవ్ర నిరసన తెలిపారు. సీమాంధ్ర పాలకుల నిర్లక్ష్యం వల్లనే ఎంజీఎంలో పసిమొగ్గలు మృత్యువాత పడుతున్నారని, 14 వెంటిలేటర్లు ఉండాల్సి ఉండగా, కేవలం 4 మాత్రమే ఉన్నాయని, అంతే కాకుండా, మిగతా సౌకర్యాల కల్పనలో కూడా పాలకుల నిర్లక్ష్యం
స్పష్టమవుతుందని జూడాలు మండిపడ్డారు. ఈ నిజాలను కప్పిపుచ్చడానికి శిశు మరణాలకు డాక్టర్లే కారణమంటూ ఆరోపిస్తూ మంత్రులు తనిఖీకి రావడంపై వారు నిరసన తెలిపారు. వారికి స్థానిక టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, వినయ్ భాస్కర్, రాజయ్య, పార్టీ కార్యకర్తలు జత కలిశారు. ఈ సందర్భంగా జూడాలు, తెలంగాణవాదులు కలిసి మంత్రులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎంజీఎంలో శిశు మరణాలకు పాలకులే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రాంతానికి ద్రోహం చేసే మంత్రులారా గో బ్యాక్ అంటూ నినదించారు. పోలీసులు జూనియర్ డాక్టర్లను అడ్డుకునే ప్రయత్నం చేయగా, ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు జూడాలను బలవంతంగా బయటకు నెట్టేశారు. పోలీసుల తీరును జూడాలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆస్పత్రి సమస్యలను పరిష్కరించాలని మంత్రులను అడుగడానికి వస్తే తమను అడ్డుకోవడం ఎంత వరకు సమంజసమని పోలీసులను నిలదీశారు. ఓ దశలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అనంతరం పోలీసులు జూడాలతోపాటు తెలంగాణవాదులను అరెస్టు చేశారు.
చేతులు కాలాక.. 28 కోట్లు..
‘చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు’ అన్న చందాన ఎంజీఎం ఆస్పత్రిలో పదుల సంఖ్యలో చిన్నారులు తమ ప్రాణాలు కోల్పోయాక ప్రభుత్వం ఆస్పత్రిలో మెరుగైన సౌకర్యాల కల్పన కోసమని 28 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఈ విషయాన్ని రాష్ట్ర వైద్యా విద్యా శాఖా మంత్రి కొండ్రు మురళి ప్రకటిస్తూ ఎంజీఎంతోపాటు దాని అనుబంధ ఆస్పత్రుల అభివృద్ధికి రూ.78 కోట్లు మంజూరు చేస్తున్నట్లు అట్టహాసంగా వెల్లడించారు. మంత్రి ఈ ప్రకటన చేయడంపై హర్షం కన్నా విమర్శలే ఎక్కువగా వెల్లువెత్తాయి. చిన్న పిల్లలు చస్తే గానీ ప్రభుత్వంలో చలనం రాలేదని, అదే సీమాంధ్రలో అడుగక ముందే అన్ని సౌకర్యాలతో ఆస్పత్రులు కట్టిస్తారని ఆస్పత్రి వర్గాలు, రోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంజీఎం ఆస్పత్రి సమావేశ హాలులో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి కొండ్రు మురళి మాట్లాడుతూ ఎంజీఎంలో సౌకర్యాల కొరత వాస్తవమే అని మంత్రి అంగీకరిస్తూ త్వరలో 350 మంది సిబ్బందిని నియమించడంతోపాటు శాశ్వత ప్రతిపాదికన స్పెషలిస్ట్ వైద్యులను నియమిస్తామన్నారు. అందుబాటులో 6 కోట్ల ఆరోగ్యశ్రీ, ఆస్పత్రి అభివృద్ధి నిధులను తక్షణమే వినియోగించుకోవాలని మంత్రి తెలిపారు. 260 మంది కాంట్రాక్టు సిబ్బంది, 338 కాంట్రాక్టు స్టాఫ్ నర్సుల్లో ఆర్హత కల్గిన వారిని రెగ్యూలరైజ్ చేస్తామన్నారు. శిశు మరణాలు ఆరికట్టడానికి ఎంజీఎం ఆస్పత్రికి వారంలో పరికరాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. మరో పది వెంటిలెటర్లలతోపాటు సి.ప్యాడ్లు 15, ప్యాతో థెరఫి ఈసీకి బెటర్స్ 20, మల్టీ చానల్ మానిటర్స్ 20, ఫవర్ కాట్స్, వార్మర్స్‌ను సమకురుస్తామని ఆయన తెలిపారు. కేఎంసీలో కొత్తగా 50 సీట్లు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.