సర్కారు విధానాలవల్లే రైతు ఆత్మహత్యలు

1
– టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి

హైదరాబాద్‌,అక్టోబర్‌3(జనంసాక్షి):

తెలంగాణలో ప్రభుత్వ వైఫల్యం వల్ల రైతాంగం సంక్షోభంలో ఉందని పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ఆరోపించారు. రైతులకు ఒకే సారి రుణమాఫీ చేయకుంటే అసెంబ్లీని స్తంభింపజేస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మహబూబ్‌నగర్‌ను కరువు జిల్లాగా ప్రకటించాలని ఆయన డిమాండ్‌ చేశారు. వరికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం 200 మద్దతు ధర ఇవ్వాలని ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. సమస్యలపై చర్చించే ధైర్యం ప్రభుత్వానికి లేకుండా పోయిందన్నారు. ఎన్నిరోజులైనా చర్చిస్తమాన్న వారు సభలో మాట్లాడితే వాయిదా వేసుకుని పోయారన్నారు. ఇదిలావుంటే సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్‌ నేత భట్టి విక్రమార్క తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేజీ టు పీజీ అమలు అంతా బూటకమని ఆయన చెప్పారు. కరీంనగర్‌ జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి సంతోష్‌ ఆత్మహత్యతోనైనా ప్రభుత్వం కళ్లు తెరవాలని హితవు పలికారు. తెలంగాణలో కేజీ టు పీజీ అమలు జరిగి ఉంటే పేద విద్యార్థులకు ఈ దుస్థితి వచ్చేది కాదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాహక్కు చట్టాన్నైనా కఠినంగా అమలు చేయాలని సూచించారు. ప్రైవేట్‌ విద్యాలయాల్లో దోపిడీపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. గ్రామ పంచాయతీ ఉద్యోగుల క్రమబద్ధీకరణపై కేసీఆర్‌ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని మల్లు భట్టివిక్రమార్క సూచించారు. రైతు సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికే కేసీఆర్‌ జలదృశ్యం అంశాన్ని తెరపైకి తెస్తున్నారని డీకే అరుణ చెప్పారు. ముందు రైతు ఆత్మహత్యల చిత్రాన్ని చూడాలని డీకే అరుణ హితవు పలికారు. రైతు రుణమాఫీపై ప్రకటన చేశాక విూరు ఏ సినిమాలైనా చూపించండని ఆమె ఎద్దేవా చేశారు. రుణమాఫీ వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌పై స్పష్టత ఇచ్చేవరకు పోరాడుతామని చెప్పారు. సభలో జలదృశ్యానికి గవర్నర్‌ అనుమతివ్వరాదని కోరారు. జలదృశ్యం చూడడానికి గవర్నర్‌ సభకు వచ్చి గౌరవం పోగొట్టుకోవద్దని డీకే అరుణ సూచించారు.