సర్కారు హత్యలే కాదు.. రేప్‌లు చేయిస్తోంది

2

– తమ్మినేని

హన్మకొండ ,సెప్టెంబర్‌23(జనంసాక్షి):

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సర్కార్‌ హత్యలతో పాటుగా అత్యాచారాలను చేయిస్తోందని, వరంగల్‌లో జరిగింది ఎన్‌కౌంటర్‌ కాదని అవి ముమ్మాటికీ హత్యలేనని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ధ్వజమెత్తారు. వరంగల్‌ జిల్లా హన్మకొండలోని సీపీఎం జిల్లా కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శృతి, విద్యాసాగర్‌రెడ్డిల ఎన్‌కౌంటర్‌పై తీవ్రంగా స్పందించారు. గత ప్రభుత్వాలు కేవలం ఎన్‌కౌంటర్‌లు మాత్రమే చేయించేవి, కానీ కేసీఆర్‌ సర్కార్‌ హత్యలే కాదు అత్యాచారాలను ప్రోత్సహిస్తుందని మండిపడ్డారు. కార్మిక సమ్మేళనం, కార్మిక హక్కులను కాలరాస్తూ రాష్ట్రంలో కేసీఆర్‌ ఫ్యూడలిస్టు పాలన కొనసాగిస్తున్నాడని దుయ్యబట్టారు. రాజ్యాంగ బద్ధంగా చేస్తున్న సమ్మెలను అణగదొక్కుతు నిరంకుశ పాలనకు అద్దం పడుతున్నాడని అన్నారు.రాష్ట్రం ఏర్పడిన తర్వాత 1300ల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే అందులో కొందరికి కేవలం రూ. 1.50 లక్షల నష్టపరిహారం చెల్లించి చేతులు దులుపుకున్న సీఎం కేసీఆర్‌, ఇక నుంచి మరణించిన రైతు కుటుంబాలకు ఆరు లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తానని ప్రకటించడం దౌర్భాగ్యమన్నారు. త్వరలో జరగనున్న వరంగల్‌ లోక్‌సభ స్థానానకి జరిగే ఎన్నికల బరిలో నిలబడే అభ్యర్థిని అక్టోబర్‌ 1వ తేదీన వామపక్షాలు, ప్రజా సంఘాలతో చర్చించి ప్రకటిస్తామని తెలిపారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జి రాములు, ప్రభాకర్‌రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు రాగుల రమేష్‌, వెంకట్‌ లు పాల్గొన్నారు.