సర్కార్‌ గ్రామాలకు తరలాలి..

2
రైతు ఆత్మహత్యలపై అధ్యాయనం చేయాలి
పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌

హైదరాబాద్‌,సెప్టెంబర్‌14(జనంసాక్షి):

ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను మంత్రులు ఎందుకు పరామర్శించడంలేదని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. గ్రామాల్లోకి వెళ్లి చూస్తే ఎందరు ఆత్మహత్యలు చేసుకున్నారో తెలుస్తుందని అన్నారు. సోమవారం గాంధీభవన్‌లో ‘అన్నదాత ఆర్తనాదం’ పుస్తకాన్ని టిపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల ఆత్మహత్యలపై మేం రాజకీయం చేయడంలేదని స్పష్టంచేశారు. రైతు సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. ఆత్మహత్యచేసుకున్న రైతులపట్ల చులకనగా మాట్లాడడం తగదన్నారు. అలాగే ఆయా కుటుంబాలకు పరిహారం ఇవ్వండలో నిర్లక్ష్యం  తగదన్నారు. వ్యవసాయం భారంగా మారి ఆత్మహత్యచేసుకుంటున్న వారిపట్ల సానుభూతితో ఉండాలన్నారు. అవసరం లేని ఎన్నో పథకాలను ప్రవేశపెడుతున్న ప్రభుత్వం.. రైతు ఆత్మహత్యలను నివారించేందుకు ప్రయత్నించడం లేదన్నారు. రైతు ఆత్మహత్యల నివారణకు ఎన్నికల హావిూలో ఇచ్చిన విధంగా ఒకేసారి రుణమాఫీ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. అన్నదాతల ఆత్మహత్యలపై అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలతో పాటు బయట తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీస్తామని  ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.  వ్యవసాయం, రైతుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యం, నిర్లక్ష్యం కారణంగానే వ్యవసాయం సంక్షోభంలో చిక్కుకుని ఆత్మహత్యలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.