సర్కార్ విద్య పటిష్టానికి చర్యలు తీసుకోవాలి
కులం, మతం, పేదరికం, సంపన్నతతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరి ఆసక్తికి తగ్గ విద్యను అందించాలని మేధావులు కోరుతున్నారు. అందరూ స్వేచ్ఛగా విద్యన పొందే హక్కు కల్పించాలి. ప్రస్తుతం అమలవుతున్న విద్యా విధానం కొన్ని వర్గాల ప్రయోజనాలను నెరవేర్చే విధంగా ఉంది. ఇందులో వ్లిపవాత్మకమైన మార్పులు తీసుకురావాలి. నిత్య అభ్యాసకులుగా, మంచి పౌరులుగా ఎదగడానికి ప్రభుత్వ విద్య దోహదపడుతుంది. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనే సామర్థ్యాలను సర్కారీ విద్యతో అందించవచ్చు. ప్రభుత్వ, ప్రయివేట్ విద్యా సంస్థలు కామన్ విద్యా విధానాన్ని అమలు పర్చడం వల్ల విద్యా రంగంలో నెలకొన్న అసమానతలను దూరం చేయడం వీలవుతుంది. అణగారిన వర్గాలకు ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి పాలకులు కృషి చేయాలి. పాఠ్యాంశాలను బోధించడంలో శాస్త్రీయ పద్ధతులను అనుసరించాలి. కొత్తగా, విభిన్నంగా ఆలోచించడాన్ని ప్రోత్సహించే విధంగా పాఠ్యాంశాలను రూపొందించాలి. ప్రస్తుత సమాజ యధార్థసితిని కాపాడేలా కాకుండా సృజనాత్మక ఆలోచనలు ప్రేరేపించే పాఠ్యాంశాల కోసం అన్వేషణ మొదలుపెట్టాలి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పడిపోవడానికి కారణాలను శాస్త్రీయ పద్ధతుల్లో అధ్యయనం చేయడం కోసం నిపుణులతో కమిటీలను ఏర్పాటు చేయాలి. ఆ నివేదికల ఆదారంగా ప్రభుత్వ పాఠశాలలను సమర్థతంగా నిర్వహించాలి. కొత్త రాష్ట్రంలో శాస్త్రీయమైన పద్ధతుల్లో విద్యాభివృద్ధికి నిర్ణయాలు తీసుకోవాలి. ప్రభుత్వ విద్యా రంగానికి రాష్ట్ర బ్జడెట్లో అధిక నిధులను కేటాయించడంతో పాటు అవి సక్రమంగా వినియోగం అయ్యేలా చూడాలి.
నానాటికి తీసికట్టు నాగం బొట్లు అన్న చందంగా మనదేశంలో విద్య తయారయ్యింది. ఏటేటా వేలకోట్లు ఖర్చు చేస్తున్నా సమగ్ర విద్యా విధానం అమలు కావడం లేదు. పాఠశాలను పక్కాగా తయారుచేసి,సరైన ఉపాధ్యాయులను నియమించి ఏకీకృత పాఠశాలలను నెలకొల్పాలన్న ఆశయం నెరవేరడం లేదు.ప్రైవేట్ రంగంలో ఫీజుల దోపిడీ ప్రజలను కుంగదీస్తోంది. దీంతో ఇటీవల తల్లిదండ్రలు హైదరాబాద్‌లో ఆందోలనకు దిగారు. సర్కార్ బడి అంటే మామూలు ప్రజలకు కూడా ఏవగింపు కలిగింది. దీంతో మారుమూల గ్రామాల్లో కూడా కేజీల చదువు మొదలయ్యింది. ఇది ఆహ్వానించ దగ్గ పరిణామమే అయినా చదువు కొనేందుకు నానాయాతన పడుతున్నారు. దీంతో పిల్లల భవిష్యత్ కోసం తల్లిదండ్రలు ఒళ్లు, ఇల్లు గుల్ల చేసుకోవాల్సి వస్తోంది. మోయలేని ఫీజుల భారాన్ని భరిస్తూ కష్టమైనా తమ పిల్లలను కార్పొరేట్ స్కూళ్లలోనే చేర్చే అనివార్య స్థితిని సృష్టిస్తోంది. దానినే సాకుగా చూపుతూ ప్రభుత్వ పాఠశాలల సంఖ్యను క్రమేణా తగ్గిస్తోంది. ఇదే ప్రభుత్వ పరిధిలో జరిగితే ప్రజలకు భారం పడేది కాదు. విద్యారంగంపై వేల కోట్లు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం ఈ దిశగా ఆలోచన చేయాలి. దేశంలో అన్ని ప్రాంతాల్లో ఈ సమస్య ఉంది. ప్రైవేట్‌ను కట్టడి చేయడానికి ప్రభుత్వ విద్యారంగాన్ని పటిష్టం చేయాల్సి ఉంది. బిజెపి అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా సమగ్ర విద్యావిధాన్ని ముందుకు తీసుకుని వెళ్లలేకపోయారు. విద్యారంగ సమస్యలపై ప్రతియేటా ఆందోళన చెందుతూనే ఉన్నారు. కార్పోరేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళనలు, బంద్‌లు చేస్తున్నా ప్రభుత్వాలు స్పందించడం లేదు. కార్పోరేట్ దోపిడీని అరికట్టాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదు. సరికదా కొందరు కార్పోరేట్లే ఇప్పుడు మంత్రులుగా పెత్తనం చెలాయిస్తున్నారు. ప్రధానంగా దేశవ్యాప్తంగా కార్పోరేట్ సంస్థలు విద్యారంగాన్ని తమ గుప్పిట్లోకి తీసుకుని లక్షల కోట్ల వ్యాపారం చేస్తున్నారు. కూలీ చేసుకునే వ్యక్తి సయితం తన బిడ్డను కార్పోరేట్ స్కూలుకు పంపే దౌర్భాగ్యం ఏర్పడింది. ఇకపోతే రెండు తెలుగు రాష్టాల్ల్రో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి దయనీయంగా మారింది. రెండు నెలల తరువాత తెరిచిన
పాఠశాలల్లోనూ పాత సమస్యలే పలకరిస్తుండటం దారుణం. చదువుకునే హక్కు అందరికీ ఉందని, బడి ఈడు పిల్లలు బడిలోనే ఉండాలని ఆర్భాటపు ఉపన్యాసాలు ఇస్తున్నారు తప్ప క్షేత్రస్థాయిలో వాటి పటిష్టతకు చర్యలు తీసుకోవడం లేదు. ప్రభుత్వ పెద్దలు ఆచరణలో సర్కారు పాఠశాలలను వెక్కిరించేదిగా ఉంటోంది. అడ్మిషన్లు లేవని చెబుతూ పెద్ద సంఖ్యలో పాఠశాలలను మూసివేయడానికి ప్రభుత్వం రంగం సిద్ధంచేస్తోంది. అంతేగాకుండా రేషనలైజేషన్ పేరుతో పాఠశాలలను కుదిస్తున్నారు. తాత్కాలింగా ఇది ప్రభుత్వానికి లాభించవచ్చు. పాఠశాలలను తగ్గించడం వల్ల జీతాలు, మెయింటనెన్స్ తగ్గి బడ్జెట్ భారం తగ్గవచ్చు. కానీ సామాజికంగా మనం వెనకబడిపోతామని గుర్తుంచుకోలేకపోతున్నారు. కొన్ని పాఠశాలలను ఈ రకంగా మూసివేసిందంటూ వస్తున్న వార్తలు ఆందోళనకరం. గత విద్యా సంవత్సరం కూడా దాదాపుగా అనేక ప్రాథమిక పాఠశాలలు మూతబడ్డాయి. ఈ ఏడాది అనేక పాఠశాలలు ఇదే బాటన ఉన్నట్లు సంకేతాలిస్తోంది. ప్రాథమిక విద్యకు పట్టిన దుస్థితికి అద్దం పడుతోంది. విద్యార్థుల సంఖ్య ఇలా తగ్గిపోవడానికి ప్రభుత్వ పాఠశాలల పట్ల సర్కారు అనుసరిస్తున్న వైఖరే కారణం. కనీస వసతులు ఏర్పాటు చేయకుండా, అవసరమైన సంఖ్యలో ఉపాధ్యాయులను నియమించకుండా ప్రభుత్వమే సర్కారు పాఠశాలల్లో విద్యా స్ఫూర్తిని నీరుగారుస్తోంది. లేదు. దేశ భవిష్యత్‌కు అత్యంత కీలకమైన విద్యారంగంపై ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఒకవైపు ప్రభుత్వ పాఠశాలలను ఉద్దేశపూర్వకంగానే నీరుగారుస్తున్న ప్రభుత్వం కార్పొరేట్ బడులకు ఎనలేని ప్రాధాన్యత ఇస్తోంది. విద్యార్థుల భద్రత దృష్ట్యా పాటించాల్సిన కనీస ప్రమాణాలనూ పాటించక పోయినా కార్పొరేట్ విద్యా సంస్థల ఇష్టారాజ్యం కొనసాగుతుండటం సర్కారు వైఖరికి నిదర్శనంగా బావించాలి. సర్కార్ విద్యను పటిష్టం చేయాలన్న సంకల్పం ఉన్నా అమలు కావడం లేదు.