సర్కార్‌ స్కూళ్ల బలోపేతంతోనే ప్రైవేట్‌ దోపిడీకి అడ్డుకట్ట 

ప్రైవేట్‌ స్కూళ్ల ఫీజుల దోపిడీని అరికట్టి వాటిని కంట్రోల్‌ చేయడంలో దేశవ్యాప్తంగా కఠిన చట్టాలను అమలు చేయాల్సి ఉంది. రాష్ట్రప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాఫీజుల దోపిడీని అరికట్టలేక పోతున్నాం. అలాగే అక్కడ పనిచేస్తున్న టీచర్ల శ్రమదోపిడీనికి కూడా కట్టడి చేయలేకపోతున్నాం. ఆధునిక సమాజంలో ఈ దోపిడీపై పెద్ద యుద్దమే చేయాల్సి ఉంటుంది. తెలంగాణలో ఫీజుల నియంత్రణకు కమిటీలు వేసినా లాభం లేకుండా పోతోంది. పేద మధ్యతరగతి ప్రజలు ప్రైవేట్‌ మోజులో పడి తమ పిల్లలను కాన్వెంట్లు, టెక్నో, మోడల్‌ స్కూళ్లలో చేర్పించి ఆర్థికంగా చితికి పోతున్నారు. దీనిపై సమాజంలో చైతన్యం రావాల్సిన అసవరం ఉంది. ఇకపోతే వెట్టి చాకిరీ కేంద్రాలుగా ప్రైవేట్‌ స్కూళ్లు విరాజిల్లు తున్నాయి. అయినా కార్మికశాఖ ఎలాంటి చర్య తీసుకోవడం లేదు. ప్రభుత్వ బడుల్లో అధునాతన మౌలిక సదుపాయాలు కల్పించి, డిజిటల్‌ ప్రొజెక్టర్స్‌ ద్వారా పాఠాలు బోధిస్తే అందరూ ఈ స్కూళ్లలోనే చేరతారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య దొరుకుతుందన్న భరోసా ప్రజలకు ఇవ్వాలి. ఏకోపాధ్యాయ పాఠశాలలతో అటువంటి భరోసా ఇవ్వలేం. ప్రభుత్వం ఇప్పటికైనా పాఠశాలల బలోపేతం గావించేందుకు ప్రతి తరగతికి ఒక టీచర్‌ను నియమించాలి. పాఠశాలల మూసివేత కాదు, పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం తోడ్పడాలి. ప్రభుత్వ విద్యను కాపాడుకోవడం కోసం ప్రజలు కూడా ఉద్యమించాలి. ఇకపోతే ఎక్కడో కొన్నిచోట్ల తప్ప దేశ భవిష్యత్తును రూపుదిద్దాల్సిన తరగతి గదులు సమస్యలకు నిలయాలుగా మారడం బాధాకరం. దేశ వ్యాప్తంగా పరిస్థితిలో పెద్దగా మార్పులు రావడం లేదు. పాఠ్యపుస్తకాల కొరత బెంచీలు , తాగునీరు వంటి కనీస మౌలిక సదుపాయాలు చాలా స్కూళ్లలో లేవు. దేశంలో ప్రతి ఒక్కరికి ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు అందించే బాధ్యత పాశ్చాత్య దేశాల్లో ప్రభుత్వాలే చూసుకుంటాయి. మనకు స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా ఇంకా అలాంటి ప్రయత్నాలు జరగడం లేదు. విద్యారంగం నుంచి ప్రభుత్వం క్రమేణా తన బాధ్యతను తగ్గించుకుంటూ పోవడం వల్ల ప్రైవేట్‌, కార్పొరేట్‌ శక్తులు ఈ రంగంలో చేరిపోయాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వ పాఠశాలల మదింపు, కుదింపు కార్యక్రమాన్ని చేపట్టింది. అదనపు స్కూళ్లుతెరవడానికి బదులు క్రమబద్ధీకరణ పేరుతో ఉన్నవాటినే మూసేసేందుకు పూనుకోవడం కూడా తిరోగమన చర్యగానే చూడాలి. బడి తెరిచేసరికి పిల్లలకు పుస్తకాలు, యూనిఫాం దుస్తులు, నోట్‌ పుస్తకాలు అందిస్తామని చెప్పిన ప్రభుత్వాలు ఏటా ఆచరణలో విఫలమవుతున్నాయి. మరో వైపు కార్పొరేట్‌ విద్యా సంస్థలు భారీ ఫీజులతో నిలువుదోపిడీ చేస్తుంటే వాటిని నియంత్రించేందుకు ఎలాంటి ప్రయత్నమూ చేయడం లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంచడానికి బదులు వాటిని బలహీనపరించే చర్యలకు పూనుకుంటున్నది. జాతీయ విద్యా విధానం ప్రకారం గానీ, విద్యా హక్కు చట్టం ప్రకారం గానీ ప్రాథమిక పాఠశాలల్లో కనీసం ఇద్దరు టీచర్లు ఉండాలి. ఈ నిబంధనకు ప్రభుత్వమే తూట్లు పొడుస్తున్నది. ఏకోపాధ్యాయ పాఠశాలల్లో ఇంకో టీచర్‌ను నియమించ డానికి ససేమిరా అంటున్నది. విద్యార్థులు తక్కువగా ఉన్న కారణంగానే స్కూళ్లను మూసివేస్తున్నామని చెప్పిన ప్రభుత్వం ఈ పరిస్థితికి కారణా లేమిటో గుర్తించి, వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నించవచ్చు. ఇకపోతే చాలాచోట్ల పూర్వ విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల సమిష్టి కృషి ఫలితంగా కొన్ని ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి గణనీయంగా మెరుగుపడింది. పదవ తరగతి, ఇంటర్‌లో మంచి ఫలితాలు సాధిస్తు న్నాయి. ప్రైవేట్‌ స్కూళ్లలో వేలకు వేలు ఫీజులు పోయడం కన్నా ప్రభుత్వ పాఠశాలలే మంచిది అనే భావన కలుగుతోంది. కార్పొరేట్‌ స్కూళ్లు ట్యూషన్‌ ఫీజు, బిల్డింగ్‌ ఫీజు, అడ్మిషన్‌ ఫీజు ఇలా రకరకాలపేర్లతో విద్యార్థులను పిండేస్తున్నాయి. ఇకపోతే ప్రైవేట్‌ యాజమాన్యాలు చేసే పనుల వలన విద్యార్థులలో, విద్యార్థుల తల్లిదండ్రులలో ప్రైవేట్‌ పాఠశాలలంటే ఈసడించుకునే పరిస్థితి వచ్చింది. కనీసం ఉపాధ్యాయు లతో నైనా మంచి సంబంధాలు ఉన్నాయంటే అవీ ఉండవు. రెండవ శనివారం, ఆదివారం అనకుండా పనిచేస్తున్నారు. స్కూల్‌ బంద్‌ ఉన్నా ఉపాధ్యాయులు మాత్రం ఉదయం నుండి సాయంత్రం వరకు కూర్చొని పోవాలి. ప్రభుత్వం ప్రకటించే సమయాన్ని పాటించరు. సెలవులు పాటించరు. సమయానికి జీతం ఇవ్వరు. సరైన జీతం ఉండదు. ఉద్యోగ భద్రత ఉండదు. ఆరోగ్య భద్రత అసలే ఉండదు. వీటిపైన ఎవరైనా ప్రశ్నిస్తే ప్రతీకార చర్యలుతీసుకుంటూ ఉద్యోగం నుండి తీసేయడం, కేసులు పెట్టడం తప్ప ఉపాధ్యాయుల సంక్షేమం గురించి ఆలోచనే చేయడం లేదు. ఉపాధ్యాయులను గుర్తించి, గౌరవించి, వారి సంక్షేమం గురించి ఆలోచించి పనిచేసే పాఠశాలలను మాత్రమే ప్రజలకు కూడా గౌరవించాలి. వ్యాపార దృక్పథంతో, లాభార్జనే ధ్యేయంగా ఉపాధ్యాయుల శ్రమను దోపిడి చేస్తూ, వారి జీవితాలతో ఆటలాడుకుంటున్న పాఠశాలల యాజమాన్యాలపై చర్యలకు కార్మిక శాఖ ఉపక్రమించాలి. వీటిని నియంత్రించాల్సిన ప్రభుత్వం ఆ పని చేయకుండా ప్రభుత్వ బడులపై తన ప్రతాపం చూపిస్తున్నది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువు రాదు, నాణ్యత లేదు, టీచర్లు లేరు అనే ప్రచారానికి ప్రభుత్వమే తన చర్యల ద్వారా ఆసరా కల్పిస్తున్నది.వీటిని నియంత్రించాల్సిన ప్రభుత్వం ఆ పని చేయకుండా ప్రభుత్వ బడులపై తన ప్రతాపం చూపిస్తున్నది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువు రాదు, నాణ్యత లేదు, టీచర్లు లేరు అనే ప్రచారానికి ప్రభుత్వమే తన చర్యల ద్వారా ఆసరా కల్పిస్తున్నది. నిరంతరం అభివృద్ధి గురించి మాట్లాడే ప్రభుత్వం చేయాల్సిన పని ఇదేనా? అన్నది ఆలోచించాలి. ఫీజుల దోపిడీతో పాటు,టీచర్ల శ్రమశక్తిని దోపిడీ చేస్తున్న ప్రైవేట్‌ పాఠశాలకు ముకుతాడు వేసి, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేలా ప్రభుత్వ చర్యలు ఉండాలి.