సర్వీస్ రోడ్డు కోసం పార్టీలకతీతంగా పోరాడుదాం

జిఎంఆర్ సంస్థ సహకరించాలి
– బాధిత కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించాలి
– వైస్ ఎంపీపీ బుచ్చిపాపయ్య పిలుపు
మునగాల, నవంబర్ 15(జనంసాక్షి): ఇటీవల మునగాలలో తరచూ జరుగుతున్న ప్రమాదాల దృష్ట్యా అన్ని పార్టీల వారు సర్వీస్ రోడ్డు కోసం పోరాడి సాధించుకోవాలని మునగాల వైస్ ఎంపీపీ కొలిశెట్టి బుచ్చిపాపయ్య మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన పిలుపునిచ్చారు. గత శనివారం రాత్రి మునగాల మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో జరిగిన పడిపూజ కార్యక్రమానికి హాజరై ఇంటికి వెళ్తున్న తెలుగు ప్రయాణంలో ట్రాక్టర్ పై వెళ్తున్న దాదాపు 30 మంది భక్తులకు లారీ ఢీకొని ఐదుగురు మరణించగా 15 మందికి పైగా క్షతగాత్రులైన విషయం విధితమే. అయితే మృతుల కుటుంబాలకు 20 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని, క్షతగాత్రులైన కుటుంబాలకు 5 లక్షల రూపాయలు చొప్పున ఎక్స్గ్రేషియా చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అయితే మునగాల మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని జాతీయ రహదారి వెంట ఇటీవల అనేక ప్రమాదాలు జరుగుతుండడంతో జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న ప్రయాణికులతో పాటు పాదాచారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. జాతీయ రహదారి పైకి రావాలంటే భయంతో కూడిన ప్రయాణాలు చేయవలసి వస్తుందని పలువురు ప్రయాణికులు తమ బాధను వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా సోమవారం నాడు మండల కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పలువురు టిఆర్ఎస్ నాయకులు మాట్లాడిన తీరును ఆయన తప్పుపట్టారు. అధికార పార్టీ నాయకులు శవరాజకీయాలు అనే పదం వాడటం తప్పుగా భావించి, ఆ మాటను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మునగాల మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మండవ చంద్రయ్య మాట్లాడుతూ, పోలీసు వారి నిర్లక్షం కారణంగానే ఇంత పెద్ద ఘోర ప్రమాదం సంభవించిందని, దీనికి రక్షణ శాఖ భద్రత వైఫల్యమే కారణమని ఆయన అన్నారు. అతి భారీ స్థాయిలో జరుగుతున్న ప్రమాదాల దృష్ట్యా జిఎంఆర్ సంస్థ వెంటనే స్పందించి సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. టిఆర్ఎస్ పార్టీ నేతలు శవరాజకీయాలు అనడం అర్ధరహితమని ఆరోపించారు. త్వరలోనే సర్వీస్ రోడ్ల విషయమై అఖిలపక్ష సమావేశం నిర్వహించి జిల్లా మంత్రి జిల్లా కలెక్టర్ ఎస్పీ ఎంపీ ఎమ్మెల్యేలకు పూర్తిస్థాయి సమాచారంతో వినతి పత్రాన్ని సమర్పించనున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ బాధ్యులు చొరవ తీసుకొని బాధిత కుటుంబాలను పరామర్శించి వారికి ఆర్థిక సహాయాన్ని ప్రకటించాలని ఆయన కోరారు. ఈ విషయాన్ని నల్లగొండ ఎంపీ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ప్రత్యేక నిధి కేటాయించడానికి ప్రయత్నిస్తామని ఆయన తెలిపారు. అంతేగాక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాసర్ల కోటయ్య మాట్లాడుతూ, గత ప్రభుత్వాలు అని అధికార పార్టీ నాయకులు అనడం శోచనీయమని, గత ప్రభుత్వమైన కాంగ్రెస్ పార్టీ జాతీయ రహదారి విస్తరణకు పూర్తి సహకారం అందించిందని, ఈ విషయాన్ని కూడా గుర్తు చేసుకోవాలని ఆయన కితాబిచ్చారు. రోడ్డు ప్రమాదాలు గూర్చిన విషయాలు రాజకీయాలకు పూయొద్దని సూచించారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన, గాయపడిన కుటుంబాలకు నల్లపాటి ఫౌండేషన్ చేసిన ఆర్థిక సహకారం హర్షణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉప్పుల జానకిరెడ్డి, కాసర్ల శ్రీనివాస్, బచ్చు అశోక్, వీరబాబు, పాలపాటి ప్రవీణ్, మట్టయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.