సల్మాన్‌కు ఐదేళ్ల జైలు శిక్ష

పదమూడేళ్లుగా సాగిన హిట్ అండ్ రన్ కేసులో తుది తీర్పు వెలువడింది. ఈ కేసులో సల్మాన్‌ ఖాన్ ను దోషిగా నిర్థారిస్తూ, ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 25 వేల జరిమానా విధించింది. ప్రమాదం జరిగిన సమయంలో సల్మాన్ తాగి ఉన్నాడని ప్రాసిక్యూషన్ గట్టిగా వాదించింది. ఈ కేసులో సాక్ష్యాలన్నీ సల్మాన్ కు వ్యతిరేకంగా ఉండటంతో డిఫెన్స్ వాదనలు తేలిపోయాయి. కోర్టు తీర్పు పట్ల పబ్లిక్ ప్రాసిక్యూటర్ హర్షం వ్యక్తం చేశారు. చట్టం ముందు ఎవరూ అతీతులు కారని మరోసారి నిరూపితమైందన్నారు.
హిట్ అండ్ రన్ కేసు 2002లో నమోదైంది. అప్పటికే ఐశ్వర్యారాయ్‌ తో ప్రేమ వ్యవహారం బెడిసికొట్టి, రాజస్థాన్‌లో కృష్ణ జింకల వేట కేసులో ఇరుక్కొని సల్మాన్ తీవ్రమైన డిప్రెషన్ లో ఉన్నాడు. సెప్టెంబర్ 28న ముంబైలో ఒక పార్టీకి అటెండ్ అయిన సల్మాన్…అర్ధరాత్రి జేడబ్ల్యూ మారియట్ హోటల్ నుంచి తన ల్యాండ్ క్రూయిజర్ వాహనంలో బయల్దేరాడు. తన ఇంటికి సమీపంలో ఉన్న బాంద్రాలోని ఒక బేకరీ ముందు పేవ్‌మెంట్‌పై పడుకున్న వారిపైకి ఆ వాహనం దూసుకెళ్లింది. ఆ ప్రమాదంలో నూరుల్లా మెహబూబ్ షరీఫ్ అనే వ్యక్తి చనిపోగా, నలుగురు తీవ్ర గాయాల పాలయ్యారు.
మొదట బాంద్రా మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు ఈ కేసును విచారించింది. కేవలం రెండేళ్ల గరిష్ట శిక్ష పడే అవకాశమున్న నిర్లక్ష్య పూరిత డ్రైవింగ్’ ఆరోపణల మీద సల్మాన్‌పై విచారణ జరిపిన ఆ కోర్టు… 2012లో పదేళ్ల గరిష్ట జైలుశిక్ష వేసేందుకు అవకాశమున్న ‘ఐపీసీ 304 పార్ట్ 2 సెక్షన్ కిందకు మార్చి, విచారణను సెషన్స్ కోర్టుకు బదిలీ చేసింది. వాటితో పాటు, సెక్షన్ 279 వేగంగా, నిర్లక్ష్యంగా డ్రైవింగ్, సెక్షన్ 337, 338, తీవ్రంగా గాయపరచడం, సెక్షన్ 427 ఆస్తుల ధ్వంసం, సెక్షన్ 34(ఏ), (బీ) నిబంధనలకు విరుద్ధంగా వాహనం నడపడం వంటి సెక్షన్ల కింద కేసు నమోదైంది. దాంతో సల్మాన్ చుట్టూ ఉచ్చు మరింత బిగుసుకుంది.
హిట్ అండ్ రన్ కేసులో మొదటి నుంచి ప్రాసిక్యూషన్ గట్టి వాదనలు వినిపిస్తూ వచ్చింది. ప్రమాద సమయంలో సల్మాన్‌ స్వయంగా ఆ వాహనాన్ని నడుపుతున్నాడని ప్రాసిక్యూషన్ తరపు లాయర్లు వాదించారు. అప్పుడు సల్మాన్ మద్యం మత్తులో ఉన్నాడని, అందుకు సంబంధించి సాక్ష్యాలున్నాయని తెలిపారు. అంతేకాదు, సల్మాన్ కు వ్యతిరేకంగా అతని బాడీగార్డ్ రవీంద్ర పాటిల్ సాక్ష్యం చెప్పాడు. ఆ తర్వాత కొన్ని రోజులకే అతను చనిపోయాడు.
సల్మాన్ తరపు న్యాయవాదులు కూడా గట్టిగా వాదించారు. ప్రమాద సమయంలో డ్రైవింగ్ చేస్తోంది సల్మాన్ కాదని.. ఆయన డ్రైవర్ అశోక్‌సింగ్ డ్రైవ్ చేస్తున్నాడని వాదించారు. ఈ విషయాన్ని అశోక్ కోర్టు ముందు ఒప్పుకున్నాడు. ప్రమాద సమయంలో సల్మాన్ తాగి లేడని, హోటల్‌లో కేవలం గ్లాస్ మంచినీళ్లు మాత్రమే తాగాడని చెప్పింది. అంతేకాదు గంటకు 90 కిలోమీటర్ల వేగంతో కారు నడిపినట్లు ప్రాసిక్యూషన్ చేసిన వాదనలు అబద్దమని వాదించారు. ఇరు వర్గాల వాదనలు ఏప్రిల్ 21న పూర్తయ్యాయి.
సల్మాన్ దోషిగా తేలడంతో ఆయన హీరోగా చేస్తున్న సినిమాలపై ఎఫెక్ట్ పడింది. కండల వీరుడిని నమ్ముకుని నిర్మాతలు రూ. 200 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టి సినిమాలు తీస్తున్నారు. ఇప్పడు సల్మాన్ దోషిగా తేలడంతో వాటి పరిస్థితి ఏంటని నిర్మాతలు లబోదిబోమంటున్నారు. సల్మాన్ కేసు తీర్పుపై భారీగా బెట్టింగ్ కూడా నడిచింది. దాదాపూ రెండు వేల కోట్ల వరకూ బెట్టింగ్ జరిగిందని అంచనా.