సల్మాన్‌ కేసు తీర్పుపై సుప్రీంకు వెళ్తాం: రాజస్థాన్‌ మంత్రి

జైపూర్‌: కృష్ణజింకలను వేటాడిన కేసులో నిర్దోషిగా తీర్పు వచ్చినా కూడా.. బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌ను ఆ కేసు వదిలేలా లేదు. ఘటన సమయం నుంచి కనబడకుండా పోయిన సల్మాన్‌ డ్రైవర్‌ మీడియా ముందుకు రావడంతో ఈ కేసు మరోసారి తెరమీదకొచ్చింది. దీంతో ఈ కేసులో తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్తామని రాజస్థాన్‌ న్యాయశాఖ మంత్రి రాజేంద్ర రాథోడ్‌ అన్నారు.

కృష్ణజింకల కేసులో రాజస్థాన్‌ హైకోర్టు సల్మాన్‌ను నిర్దోషిగా ప్రకటించిన రెండు రోజుల తర్వాత.. ఘటన సమయంలో సల్మాన్‌ వాహనాన్ని నడిపిన అతడి డ్రైవర్‌ హరీశ్‌ దులానీ మీడియాతో మాట్లాడారు. సల్మాన్‌ఖానే జింకను వేటాడారని, అయితే తనకు ప్రాణహాని ఉండటంతో కనబడకుండా పోయినట్లు చెప్పాడు. తనకు భద్రత కల్పిస్తే.. న్యాయస్థానానికి ఈ విషయాన్ని చెప్పేవాడినని హరీశ్‌ తెలిపాడు.

హరీశ్‌ వ్యాఖ్యలపై రాజస్థాన్‌ హోంమంత్రి గులాబ్‌ చంద్‌ కటారియా స్పందించారు. రక్షణ కావాలని అతడెప్పుడూ తమను ఆశ్రయించలేదని..ఇప్పటికైనా రాతపూర్వకంగా కోరితే.. భద్రత కల్పిస్తామని తెలిపారు. రాష్ట్ర న్యాయశాఖ మంత్రి రాజేంద్ర మాట్లాడుతూ.. ఈ కేసులో న్యాయపరమైన అంశాలను పరిశీలిస్తున్నామని.. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లనున్నట్లు చెప్పారు.