సల్వీందర్‌ సింగ్‌ను ప్రశ్నించిన ఎన్‌ఐఏ

223

న్యూఢిల్లీ,జనవరి11(జనంసాక్షి): పఠాన్‌కోట ఉగ్రదాడిపై విచారణ వేగవంతం చేశారు. ఉగ్రవాదులకు సహకరించి ఉండొచ్చని ఆరోపణలు ఎదుర్కొంటున్న గురుదాస్‌ పూర్‌ ఎస్పీ సల్వీందర్‌ సింగ్‌ సోమవారం ఉదయం ఎన్‌ఐఏ ఉన్నత కార్యాలయ సముదాయానికి వచ్చారు. సోమవారం తమ ముందు హాజరుకావాలని ఎన్‌ఐఏ ఇచ్చిన నోటీసుల ప్రకారం ఆయన సోమవారం ఉదయమే అక్కడికి చేరుకున్నారు. పఠాన్‌ కోట్‌ పై జైషే ఈ మహ్మద్‌ ఉగ్రవాదులు దాడులు జరిపిన విషయం తెలిసిందే. ఈ దాడికి పరోక్షంగా సల్వీందర్‌ సహకరించి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పఠాన్‌ కోట్‌ దాడికి ముందు తమను కొందరు వ్యక్తులు కిడ్నాప్‌ చేశారని, వారి వాహనాల్లో భారీ ఆయుధ సామాగ్రి కూడా ఉందని, తనను మధ్యలో జీపులో నుంచి తోసేసి వెళ్లిపోయారని సల్వీందర్‌ సింగ్‌ ఎన్‌ఐఏ అధికారులకు చెప్పారు. అనంతరం ఎన్‌ఐఏ సందించిన పలు ప్రశ్నలకు కూడా ఆయన పొంతన లేని సమాధానాలు చెప్పడంతో పోలీసులకు ఆయనపై మరింత అనుమానం పెరిగి లైడిటెక్టర్‌ పరీక్షలకు కూడా సిద్ధమయ్యారు.పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లో ఉగ్రదాడి ఘటనకు ముందు ఉగ్రవాదులు తనను అహరించినట్లు చెబుతున్న సల్వీందర్‌ సింగ్‌ మాటల్లో పొంతన లేకపోవడంతో అధికారులు ఆయనను అనుమానిస్తున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై విచారణకు హాజరవ్వాల్సిందిగా సల్వీందర్‌కు నోటీసులు అందడంతో ఆయన ఈరోజు ఎన్‌ఐఏ కార్యాలయానికి వెళ్లారు. నిజానిజాల్ని తెలుసుకోవడానికి ఆయనకు లైడిటెక్టర్‌ పరీక్ష చేసే అవకాశం ఉంది. సల్వీందర్‌ సింగ్‌తో పాటు అపహరణకు గురైన ఆయన స్నేహితుడు రాజేశ్‌, వంటమనిషి మదన్‌గోపాల్‌, కారు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. పఠాన్‌కోట్‌ వైమానిక స్థావరంపై ఉగ్రదాడికి సంబంధించి ఎన్‌ఐఏ మూడు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. ఇటీవల జరిగిన ఈ దాడిలో ఏడుగురు భద్రతాసిబ్బంది ప్రాణాలు కోల్పోగా, ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.