సల్వీందర్ సింగ్ ఇంటిపై ఎన్‌ఐఏ దాడులు
న్యూఢిల్లీ,జనవరి21(జనంసాక్షి): జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) అమృతసర్ లోని సీనియర్ పోలీసు అధికారి సాల్వీందర్ సింగ్ నివాసంతో పాటు పంజాబ్ లోని ఐదు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. పఠాన్‌కోట్ ఉగ్రదాడి ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఏన్‌ఐఏ) దర్యాప్తు ముమ్మరం చేసింది. గురుదాస్‌పూర్‌లో 4, అమృత్‌సర్‌లో రెండు చోట్ల ఎన్‌ఐఏ ఈరోజు సోదాలు నిర్వహిస్తోంది. పఠాన్‌కోట్ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్పీ సల్వీందర్‌సింగ్ ఇంటితో పాటు మరో ఇద్దరికి చెందిన ఇళ్లలో కూడా అదికారులు సోదాలు చేపట్టారు.కాగా, గణతంత్ర వేడుకల నేపథ్యంలో ఢిల్లీలో పోలీసులు తనిఖీలు, దాడులు ముమ్మరం చేశారు. ఉగ్రవాద దాడుల హెచ్చరికల నేపథ్యంలో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఢిల్లీ మొత్తం డేగకళ్ల అదుపులో ఉంది. ఢిల్లీ ప్రత్యేక విభాగం పోలీసులు ఉత్తరాఖండ్‌లో నలుగురు అనుమానిత ఉగ్రవాదులను అరెస్టు చేశాక దర్యాప్తు ముమ్మరం చేశారు. వీరికి ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నట్లు భావిస్తున్నారు. గణతంత్ర వేడుకలు సవిూపిస్తున్న నేపథ్యంలో అనుమానిత ఉగ్రవాదులు పట్టుబడటంతో దిల్లీ పరిసర ప్రాంతాల్లో పోలీసులు అప్రమత్తత ప్రకటించారు. పట్టుబడిన వ్యక్తులను విచారిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హరిద్వార్‌లో జరుగుతున్న అర్ధకుంభ మేళాలో దాడి చేసేందుకు వీరు కుట్ర పన్నినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ నలుగురు యువకులు సిరియాలోని వ్యక్తులతో నిత్యం ఫోన్‌లో సంభాషిస్తున్నారని.. బాంబు పేలుడుకు సంబంధించిన సమాచారాన్ని పలు వెబ్‌సైట్లలో శోధించారని అధికారులు వివరించారు. ఇదిలావుంటే పంజాబ్ లోని మరోసారి ఉగ్ర కలకలం రేగింది. పఠాన్ కోట్ కు సవిూపంలో అంతర్జాతీయ సరిహద్దు వద్ద బుధవారం రాత్రి అక్రమ చొరబాబుదారుడిని బీఎస్‌ఎఫ్ సైనికులు హతమార్చారు. మృతుడు పాకిస్థాన్ దేశస్తుడిగా
అనుమానిస్తున్నారు. ముగ్గురు వ్యక్తులు సరిహద్దు దాటి మనదేశంలోకి వచ్చేందుకు ప్రయత్నించగా వారిని నిలువరించేందుకు ప్రయత్నించినట్టు బీఎస్‌ఎఫ్ వర్గాలు వెల్లడించాయి. అయితే వారు వెనక్కు తగ్గకపోవడంతో కాల్పులు జరిపినట్టు తెలిపాయి. వీరిలో ఒకరు మృతి చెందగా, ఇద్దరు పాకిస్థాన్ వైపు పారిపోయారని పేర్కొన్నాయి. ఈ నెల ఆరభంలో పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రవాదుల దాడి జరిగినప్పటి నుంచి సరిహద్దులో భద్రతను కట్టుదిట్టం చేశారు. రాత్రి దట్టమైన మంచు ఉండడంతో సరిహద్దులో అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నారని అధికారులు తెలిపారు.