సహాయం చేయడమూ అదృష్టమే!
ఎవరికైనా సహాయం చేసే అవకాశం కలగడం ఒక అదృష్టంగా భావించాలి. అలాంటి అదృష్టం మనకు కలగజేసినవాళ్ళకు కృతజ్ఞతలు చెప్పాలి. అప్పుడు మనలో ఏదైనా ఇసుమంత అహంకారం ఉంటే అది కూడా ప్రక్షాళన అయిపోయి స్వచ్ఛమైన హృదయంతో నిలవగలుగుతాం. ఎవరైనా మనంచేసే సహాయాన్ని పొగడటానికి ప్రయత్నిస్తే ‘ఈశ్వరార్పణం’ అనే ఒక్కమాటతో సరిపుచ్చవచ్చు. అన్నదానం అనే పుణ్యకార్యాన్ని ఒక ధనికుడు, ఒక పేదవాడు కూడా చేయవచ్చు. ధనికుడు పెట్టినంత రుచికరమైన అన్నాన్ని పేదవాడు పెట్టలేకపోవచ్చు. దాన ఫలితం అన్నంరుచిని బట్టి ఉండదు. ఇంకొకడు తాను తినడానికి చాలినంత లేకపోయినా, ఉన్నదాంట్లోనుంచే ఇంకొకడి ఆకలి తీరుస్తాడు. అతడు దేవుడికి అత్యంత ప్రేమపాత్రుడు.హనుమంతుడు తన గొప్పతనం చూపడం కోసం సముద్ర లంఘనం చేయలేదు. రామదండు కోరిక మేరకు సీతాన్వేషణలో భాగంగా, అంతటి సాహసం చేశాడు. ‘నువ్వు చేయగలవు… నువ్వు మాత్రమే ఈ ఘనకార్యం సాధించగలవు’ అని ఆ స్వామికి, ఆయన బలాన్ని కపివీరులు గుర్తు చేశారు. వినయశీలి తన గొప్పతనాన్ని తాను ఎప్పుడూ చెప్పుకోడు! కొద్దినైపుణ్యం ఉన్నంతనే, మరికొంచెం కండబలం ఉన్నంతనే, ఏదో ఒకమార్గంలో సొమ్ము సంపాదించగానే, విర్రవీగాలని గుణం పుట్టేవాళ్లు- హనుమాన్ దివ్యరూపాన్ని గుర్తుతెచ్చుకుంటే… తమవి కుప్పిగంతులు మాత్రమేనని తెలుసుకోగలుగుతారు!