‘సాండీ’ బీభత్సం..
ఎమర్జెన్సీ ప్రకటించుకున్న అమెరికా
అగ్రరాజ్యం అతలాకుతలం
చీకట్లో పన్నెండు రాష్ట్రాలు
12 వేల విమానాల రద్దు..
న్యూయార్క్, అక్టోబర్ 30: సూపర్‌స్టార్మ్ ‘సాండీ’ అమెరికా తూర్పు తీరంపై విరుచుకుపడింది. తీర ప్రాంతంలోని 12 రాష్టాల్ల్రో బీభత్సం సృష్టించింది. అగ్రరాజ్య చరిత్రలో ఇటీవలి కాలంలో ఏ హరికేన్ విరుచుకుపడనంత బలంగా శాండీ అమెరికాపై దాడికి దిగింది. న్యూజెర్సీ రాష్ట్రం కిందకు వచ్చే అట్లాంటిక్ సిటీ వద్ద మంగళవారం ఉదయం తీరాన్ని తాకింది. ప్రచండమైన, పెను ఉప్పెనతో కూడిన గాలులు, భీకర వర్షంతో దూసుకొచ్చిన సాండీ 12 రాష్టాల్రను అతులాకుతలం చేసింది. గంటకు 140 కిలోవిూటర్ల వేగంతో గాలులు, అలలు ఎగిసిపడ్డాయి. అలలు 100 విూటర్ల ముందుకు వచ్చాయి. న్యూయార్క్, న్యూజెన్సీ తీర ప్రాంతాలపై తుపానుతీవ్ర ప్రభావాన్ని చూపింది. దీంతో మసాచుశాట్స్, న్యూజెర్సీ, న్యూయార్క్, పెన్సిల్వేనియా, తదితర 12 రాష్టాల్ల్రో ఎమర్జెన్సీ విధించారు. ఇప్పటివరకూ న్యూయార్క్, న్యూజెర్సీ, మేరీలాండ్, పెన్సిల్వేనియా తదితర ప్రాంతాల్లో 13 మంది మృతి చెందినట్లు సమాచారం. శాండీ ప్రభావిత ప్రాంతాల్లో 22 లక్షల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. న్యూయార్క్‌లోని 3.1 మిలియన్ ప్రజలు అంధకారంలో మగ్గుతు న్నారు. భారీ వర్షంతో న్యూయార్క్‌లోని సబ్‌వేలలో నీరు చేరింది. న్యూయార్క్ నగరం ఇప్పటికే సగానికపై నీట మునిగింది. భీకర వర్షంతో పాటు ఉవ్వెత్తున ఎగిసిపడిన సముద్ర కెరటాల కారణంగా.. నగరంలోని సబ్‌వేలు నీట మునిగాయి. వీధులు
పెద్ద పెద్ద కాలువలను తలపిస్తున్నాయి. వీటితో పాటు అల్లకల్లోలంగా ఉన్న అట్లాంటిక్ మహా సముద్ర తీర ప్రాంత నగరాలు కంపించిపోతున్నాయి. కనీసం 50 లక్షల మంది అమెరికన్లు సాండీ బారిన పడ్డారు. ప్రధాన నగరాలు, పట్టణాలు అంధకారంలో మగ్గుతున్నాయి. ఇప్పటివరకూ 12 వేల విమాన సర్వీసులు రద్దు చేశారు. ఉత్తర కరోలినాలో సముద్రంలో చిక్కుకున్న 16 మందిని హెలికాప్టర్ సహాయంతో జాతీయ భద్రతా దళ సిబ్బంది రక్షించారు. అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకున్న బరాక్ ఒబామా పరిస్థితిని ఎప్పటికప్పుడు సవిూక్షిస్తున్నారు. సముద్రపు అలలు 30 విూటర్ల ఎత్తుకు ఎగిసిపడుతున్నాయి. అట్లాంటిక్ సిటీ, మన్‌హటన్ తదితర పట్టణాలు జలమయమయ్యాయి. 14 మందిని రక్షించి వారిని తరలిస్తున్న పోలీసు వాహనం సాండీ దాటికి గల్లంతైంది. వేలాది వాహనాలు కొట్టుకుపోయాయి. రైలు మార్గాలు, జాతీయ రహదారులపైకి నీరు చేరింది. అధ్యక్ష ఎన్నికల ప్రచారం రద్దయ్యింది. ఒబామ, రోవ్నిూ తమ ఎన్నికల ప్రచారాలను రద్దు చేసుకున్నారు. అధ్యక్షుడు ఒబామా వైట్‌హౌస్ నుంచి పరిస్థితిని సవిూక్షిస్తున్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, అధికారుల సూచనలు పాటిస్తూ సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. సాండీ హరికేన్‌తో వరుసగా రెండోరోజు కూడా అమెరికా మార్కెట్లు మూతబడ్డాయి. వాల్‌స్ట్రీట్‌మార్కెట్ సహా అన్ని మార్కెట్లు మూతబడ్డాయి. యూరప్ మార్కెట్లు ఓ మాదిరిగా నష్టపోయాయి. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం మంగళవారం కూడా తెరుచుకోలేదు. న్యూయార్క్, మన్‌హటన్ తదితర లోతట్టు ప్రాంతాల్లోని 3.70 లక్షల మందిని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే, చాలా మంది ఇళ్లను వదిలి సహాయ కేంద్రాలకు వెళ్లేందుకు నిరాకరిస్తున్నారు. దీనిపై ఒబామా సహా మేయర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులకు సహకిరస్తూ.. సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు. సాండీ బీభత్సంతో మరో భీకర ప్రమాదం పొంచి ఉంది. తీర ప్రాంతంలోని అణు విద్యుత్ ప్లాంట్ల భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో న్యూజెర్సీ తీర ప్రాంతాలోని ఓస్టర్ అణు విద్యుత్ కేంద్రం హైఅలర్ట్ ప్రకటించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సవిూక్షిస్తున్నారు.