సాక్ష్యాధారాలతోనే రేవంత్‌ అరెస్టు

5

చట్టపరమైన చర్యలు తీసుకుంటాం

ఏసీబీ డీజీ ఏకేఖాన్‌

హైదరాబాద్‌, మే 31(జనంసాక్షి) : ఏసీబీ అధికారులు పక్కా ఆధారాలతో తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డిని అరెస్ట్‌ చేశారు. రేవంత్‌ రెడ్డితో పాటు ఇద్దరి వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్టు ఏసీబీ తెలిపింది. విచారణలో రేవంత్‌ రెడ్డి ఇచ్చిన స్టేట్‌ మెంట్‌ ను రికార్డు చేసినట్టు పేర్కొంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేయాల్సిందిగా రేవంత్‌.. స్టీఫెన్‌ను కోరినప్పటి సంభాషణలను రికార్డు చేశారు. అయితే పక్కా సాక్ష్యాలు సేకరించిన తర్వాతే విచారణను ముమ్మరం చేసి రేవంత్‌ రెడ్డిపై కేసు నమోదు చేసినట్టు ఏసీబీ డీజీ

ఏకే ఖాన్‌ విూడియా ముందు వెల్లడించారు. స్టీఫెన్‌ రెండు రోజుల క్రితమే ఈ విషయంపై ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. కానీ, పక్కా అధారాలతోనే చర్యలు తీసుకుందామనే తాము ఎదురుచూడాల్సి వచ్చిందని ఏకే ఖాన్‌ చెప్పారు.

ఇదిలా ఉండగా, రేవంత్‌, స్టీఫెన్‌ సంభాషణకు సంబంధించి ఏసీబీ ఎలాంటి వీడియోలను విడుదల చేయలేదని ఏకే ఖాన్‌ పేర్కొన్నారు. ఐటీ డిపార్ట్‌ మెంట్‌ దీనిపై వివరాలు అడిగిందని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు నేపథ్యంలో జరిగిన ఈ  సంఘటనతో అరెస్ట్‌ విషయాన్ని ఎన్నికల కమిషన్‌కు చెబుతానమన్నారు. అలాగే ముగ్గురు వ్యక్తులు

డబ్బులు తీసుకొచ్చినట్టు తెలిపారు. వారినుంచి 50 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నామన్నారు. మొత్తం నలుగురు నిందితుల్లో ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు చెప్పారు. నిందితులపై 120 బి సెక్షన్‌ కింద కేసు నమోదు చేశామన్నారు. విచారణ అనంతరం అరెస్ట్‌ చేసి జడ్డి ముందు ప్రవేశపెడతామని ఏకే ఖాన్‌ చెప్పారు.