సాగరతీరాన ఎగిసిపడ్డ ఉద్యమం కెరటం
చీమల దండును తలపించిన రాజధాని నడిబొడ్డు
సాగర హారానికి పోటెత్తిన తెలంగాణ బిడ్డలు
ముళ్ల కంచెలను తెంచుకొని.. బ్యారికేడ్లను తోసుకొని..
లాఠీలు ఝుళిపించినా.. రక్తాలు కారుతున్నా..
బాష్ప వాయువు గోళాలు పేల్చినా..
నెక్లెస్ రోడ్డుకు చేరుకున్న లక్షలాది మంది
జోరు వానలోనూ తగ్గని పోరు హోరు
బాంబులు పడ్డా కదలమన్న ఉద్యమ సైనికులు
ప్రభుత్వ గడువు ముగిసినా.. పట్టు వదలని విక్రమార్కులు
బెదిరించినా.. కవ్వించినా.. పోలీసులను లెక్క చేయక కవాతు
తెలంగాణ సాధించే దాకా హైదరాబాద్ వీడమని ప్రతిజ్ఞ
జానారెడ్డితో ప్రభుత్వం చర్చలు
దీక్ష విరమించాలని జానా వినతి
వాతావరణం అనుకూలంగా లేనందున మార్చ్‌ను
విరమిస్తున్నట్లు టీజేఏసీ ప్రకటన
నేడు తెలంగాణ వ్యాప్తంగా రాస్తారోకోలు
రేపటి నుంచి ఇందిరా పార్క్ దగ్గర నిరసన దీక్ష
తెలంగాణ తేవాల్సిన బాధ్యత టీమంత్రులదే.. లేకుంటే
రాజీనామా చేయాలి
త్వరలో ఆమరణ దీక్ష : కోదండరాం
పాలకులకు ముచ్చెమటలు పట్టించి విజయవంతమైన సాగర హారం
”తెలంగాణ బిడ్డ వస్తడట ! రాష్ట్రం కోసం నినదిస్తడట ! మా మెడలే వంచుతడట ! ఆకాంక్ష నెరవేర్చుకుం టడట ! ఎట్లొస్తడో మేం జూస్తం.. ఏం జేస్తడో మేం జూస్తం.. మా దగ్గర లాఠీలున్నయ్.. అంతకన్నెక్కువ అధికారముంది.. రాకుండా అడ్డుకుంటం.. ఎక్కడ ికక్కడ నిలువరిస్తం.. తెలంగాణ మార్చ్‌లో పాల్గొననివ్వం.. ఆకాంక్షను చాటనివ్వం.. తెలంగాణ రానివ్వం.. మా దోపిడీని ఇక ముందూ సాగిస్తం..” అంటూ సీమాంధ్ర పాలకులు సెప్టెంబర్ 30న తెలంగాణ మార్చ్ కోసం వస్తున్న తెలంగాణ ఉద్యమ సైనికుల గురించి పన్నిన కుట్ర పన్నారు. కానీ, ”తెలంగాణ బిడ్డ వచ్చిండు.. రాష్ట్రం కోసం నినదించిండు.. తన ఆకాంక్షను చాటిండు.. ప్రభుత్వమిచ్చిన గడువు ముగిసినా.. రాజ్యం బెదిరించినా.. రాష్ట్రం వచ్చే దాకా నెక్లెస్ రోడ్డే
తన ఇల్లన్నడు.. జోరు వానలోనూ పోరు సాగించిండు.. దీనికి ముందు లాఠీ దెబ్బలు తిన్నడు.. అధికారముందని విర్రవీగినోళ్లను ధిక్కరించిండు.. తెలంగాణ మార్చ్‌లో పాల్గొన్నడు.. తెలంగాణ ఇస్తేనే ఊరికోవుడు.. లేకుంటే, ఇక్కడే కూసునుడని తేల్చి చెప్పిండు.. సీమాంధ్ర పాలకులకు
హైదరాబాద్, సెప్టెంబర్ 30 (జనంసాక్షి) :
ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తెలంగాణ జేఏసీ నిర్వహిస్తున్న తెలంగాణ మార్చ్‌కు తెలంగాణ ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. ఊహించిన దాని కన్నా పెద్ద ఎత్తున తెలంగాణవాదులు మార్చ్‌లో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు చేరుకున్నారు. రాజధాని నడిబొడ్డు తెలంగాణవాదులతో చీమలదండును తలపించింది. సాగర హారంలో పాల్గొనడానికి వచ్చిన ప్రజలతో హుస్సేన్ సాగర తీరమైన నెక్లెస్ రోడ్డు జనసంద్రాన్ని తలపించింది. కానీ, ప్రభుత్వం మాత్రం మార్చ్‌కు అనుమతిచ్చినట్లే ఇచ్చి మోసగించింది. శాంతియుతంగా సాగరహారానికి తరలివస్తున్న నాయకులను అడ్డుకునేందుకు ముమ్మర ఏర్పాట్లు చేసింది. తెలంగాణలోని పది జిల్లాల్లో హైదరాబాద్‌కు పయనమైన నాయకులను ఎక్కడికక్కడ వేల సంఖ్యలో పోలీసులతో అడ్డుకోజూసింది. ఎలాగోలా రాజధానికి చేరుకున్న తెలంగాణవాదులను నిరసన వేదిక పి.వి.ఘాట్‌కు చేరుకోకుండా అడ్డుకోవాలని, నగరం మొత్తాన్ని పోలీసులతో దిగ్బంధించింది. ఎక్కడికక్కడ బారికేడ్లు, ముళ్ల కంచెలు ఏర్పాటు చేసింది. అయినా, తెలంగాణవాదులు ఏ మాత్రం బెదరకుండా ముందుకే సాగారు. హైదరాబాద్‌లో అనేక చోట్ల బ్యారికేడ్లను, ముళ్ల కంచెలను తోసుకుని తెలంగాణవాదులు కదంతొక్కారు. ఈ క్రమంలో పోలీసులు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. తెలంగాణవాదులను ఎలాగైనా నెక్లెస్ రోడ్డుకు వెళ్లకుండా అడ్డుకోవడానికి పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. లాఠీచార్జి చేసి, భాష్పవాయు గోళాలు ప్రయోగించారు. అనేక చోట్ల తెలంగాణవాదులు నెత్తురోడారు. అనుమతి ఇచ్చి ఇలా అడ్డుకోవడమేందని పోలీసులను నిలదీశారు. పోలీసులు ఇవేమీ పట్టించుకోకుండా తమ దాష్టీకాన్ని కొనసాగించారు. ఈ సంఘటనలు జరుగుతుండగానే రాష్ట్ర డి.జి.పి. దినేశ్‌రెడ్డి హెలికాప్టర్‌లో ఏరియల్ సర్వే నిర్వహించారు. ఇది గమనించిన తెలంగాణవాదులు పైకి చెప్పులు చూపించి, పోలీసుల చర్యలపై తమ నిరసన తెలిపారు. పోలీసులు మాత్రం తమ ప్రతాపాన్ని తెలంగాణవాదులపై అలాగే కొనసాగించారు. అరెస్టులు చేయడం ఎక్కువ చేశారు. దీంతో ఆగ్రహించిన తెలంగాణవాదులు రెండు పోలీసు వాహనాలకు నిప్పు పెట్టారు. అరెస్టుల పర్వం పెరిగిపోతుండడంతో ఆగ్రహించిన తెలంగాణ ఎంపీలు అనుమతి ఉన్నా అరెస్టులెందుకు చేస్తున్నారంటూ నిలదీయడానికి సీఎంను కలిసేందుకు బయలుదేరారు. కానీ, పోలీసులు వారిని సీఎంను కలువనివ్వలేదు. పైగా, ఇలా వారిని రెండుసార్లు అరెస్టు చేసి, ప్రజాప్రతినిధులని కూడా చూడకుండా అరెస్టు చేశారు. వారిని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కె.కేశవరావు ఇంట్లో గృహ నిర్బంధంలో ఉంచారు. మరో వైపు ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు తెలంగాణ మార్చ్‌కు రాకుండా పోలీసులు భాష్పవాయు గోళాలు ప్రయోగించారు. లాఠీచార్జి చేశారు. విద్యార్థులు మాత్రం రాత్రి వరకు నెక్లెస్ రోడ్డుకు వెళ్లడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ ఘర్షణలో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. ఇలా నగరంలోని దారులన్నీ పోలీసు బూటు చప్పుళ్లతో మార్మోగినా, తెలంగాణవాదులు మాత్రం తమ లక్ష్యం నుంచి వెనక్కి తగ్గలేదు. ఎక్కడ కూడా ఆవేశానికి గురి కాలేదు. పోలీసులు లాఠీలు తమపై విచక్షణారహితంగా విరుచుకు పడుతున్నా, శాంతియుతంగా నెక్లెస్ రోడ్డు వైపు సాగిపోయారు. లక్షల సంఖ్యలో సాగరహారానికి హాజరయ్యారు. నెక్లెస్ రోడ్డులో ఏర్పాటు చేసిన పి.వి.ఘాట్‌కు చేరుకున్న తెలంగాణవాదులతో అక్కడి ప్రాంతం మొత్తం జై తెలంగాణ నినాదాలతో మార్మోగింది. వేదికపై ఉన్న ఉద్యమ నాయకులు శాంతి పాటించాలని చేస్తున్న విజ్ఞప్తులను తు.చ. తప్పకుండా పాటించి, ఓపికగా వారు చేస్తున్న ప్రసంగాలను విన్నారు. తెలంగాణ కళాకారులు వారిని తమ ఆటపాటలతో ఉత్తేజపర్చగా, వారి ఆటపాటలకు అనుగుణంగా చిందేసి తెలంగాణవాదులు తమ ఆకాంక్షను చాటారు. అయితే, సాయంత్రం 7 గంటల వరకు మార్చ్‌కు అనుమతిచ్చిన ప్రభుత్వం, సమయం పూర్తి కాకముందే పోలీసులు నెక్లెస్ రోడ్డు నుంచి తెలంగాణవాదులను చెదరగొట్టేందుకు కవ్వింపు చర్యలకు దిగారు. వేదిక వెనుక నుంచి భాష్ప వాయువు గోళాలు ప్రయోగించారు. దీంతో వేదిక మీదున్న ఉద్యమ నాయకులు ఆ గోళాల ప్రభావానికి ఉక్కిరిబిక్కిరయ్యారు. మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అందరూ ఆందోళన చెందుతున్న సమయంలో, ఆయన త్వరగానే కోలుకున్నారు. అంతే కాకుండా, వేదిక ముందు నుంచి వాటర్ కెనన్లతో తెలంగాణవాదులపై పోలీసులు నీళ్లను కుమ్మరించారు. ఎటొచ్చి పోలీసుల్లో తెలంగాణవాదులు కవాతు విరమించేలా చేయాలన్న దుష్ట ఆకాంక్ష కనబడింది. ఇదంతా గమనిస్తున్న తెలంగాణవాదులు ఏ మాత్రం ధైర్యాన్ని కోల్పోలేదు. అక్కడే ఉండి తమ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తమలో ఉన్న తెగింపును ప్రదర్శించారు. ఒక్కరొక్కరుగా తెలంగాణ ఉద్యమ సారథులు, జేఏసీ నాయకులు చేస్తున్న ప్రసంగాలతో ఉత్యేజాన్ని రెట్టింపు చేసుకున్నారు. సమయం 7 గంటలు దాటినా, తెలంగాణవాదుల్లో వచ్చినప్పటి ఉత్సాహమే కనబడింది. ఉద్యోగ సంఘాల నాయకులు స్వామి గౌడ్, శ్రీనివాస్ గౌడ్ జేఏసీ చైర్మన్ కోదండరాం వచ్చే వరకు సభను బాధ్యతను భుజానికెత్తుకున్నారు. వారు మాట్లాడుతూ బాంబులు పడ్డా తెలంగాణ రాష్ట్రం వచ్చే దాకా కదిలేది లేదని స్పష్టం చేశారు. అనంతరం తెలంగాణవాదులంతా ప్రత్యేక రాష్ట్రం వచ్చే దాకా హైదరాబాద్ వదలమని ప్రతిజ్ఞ చేశారు. ఈ క్రమంలోనే తమ విద్యార్థులపై జరిగిన దాడికి నిరసనగా ఓ.యూ. జేఏసీ 48 గంటల తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చింది. నిర్బంధాలు సాగినా, అడుగడుగునా అడ్డంకులు ఎదురైనా, జోరుగా వాన కురుస్తున్నా పట్టించుకోక తెలంగాణవాదులు తెలంగాణ మార్చ్‌లో, సాగర హారంలో పాల్గొని తమ చిరకాల వాంఛను ప్రపంచానికి చాటి చెప్పడంలో విజయవంతమయ్యారు. తెలంగాణ ఇచ్చే దాకా ఇంటికి వెళ్లేది లేదని నెక్లెస్ రోడ్డులోనే భీష్మించుకు కూర్చున్నారు. రాత్రి కూడా జాగారం చేసి తమ నిరసన తెలుపాలని ఉద్యమ సారథులు నిర్ణయించారు. ఈ విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుందని భావిస్తున్నారు. తెలంగాణ పారిశ్రామికవేత్తల సంఘం ఆధ్వర్యంలో మార్చ్‌లో పాల్గొన్న వారికి యాభై వేల పులిహోర పొట్లాలు, నీళ్లు అందజేశారు. అయితే, వర్షం వల్ల వాతావరణం ప్రతికూలంగా మారడంతో జేఏసీ తన వ్యూహాన్ని మార్చింది. లక్షల సంఖ్యలో ఉన్న తెలంగాణవాదులను ఇబ్బంది పెట్టడం సరికాదని భావించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం మరోసారి సాగర హారానికి వచ్చిన తెలంగాణవాదులనుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాతావరణం అనుకూలించక పోవడంతో తెలంగాణ మార్చ్‌ను విరమిస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణ మార్చ్‌కు అనుమతి సాధించినట్లే టీ మంత్రులు తెలంగాణ సాధనలోనూ చిత్తశుద్ధి చాటాలన్నారు. లేకుంటే తమ పదవులకు రాజీనామా చేయాలని స్పష్టం చేశారు. మార్చ్‌ను విరమించినా ఉద్యమం ఆగదని సోమవారం అంటే నేడు తెలంగాణ వ్యాప్తంగా రాస్తారోకోలు, రేపటి మంగళవారం ఇందిరా పార్క్ దగ్గర నిరసన దీక్ష చేస్తామని వెల్లడించారు. అంతే కాకుండా, టీజేఏసీ ఆధ్వర్యంలో త్వరలోనే ఆమరణ దీక్ష చేస్తామని, ఆ తేదీని కూడా వీలైనంత తొందరలోనే ప్రకటిస్తామని కోదండరాం ప్రకటించారు. వెయ్యి మంది తెలంగాణ బిడ్డలు ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఆత్మార్పణ చేశారని, వారి త్యాగాన్ని వృథా కానివ్వమని తెలిపారు. వారి ఆత్మలు శాంతించాలంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తప్ప మరో ప్రత్యామ్నాయం లేదన్నారు. అది సాధించే తీరుతామన్నారు. మొదటి నుంచి కూడా తెలంగాణ ఉద్యమం శాంతియుతంగానే సాగుతున్నదని, సీమాంధ్ర పాలకులే ఉద్యమాన్ని హింసాత్మకం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ కోసం ఇక్కడి ప్రజలు ప్రాణాలు ఇచ్చారే గానీ, వేరే ఎవరిపై కనీసం కూడా రాయి విసరలేదని, అయినా స్వార్థపూరిత రాజకీయ నాయకులు తెలంగాణ ఇవ్వకుండా తమాషా చూస్తున్నరని కోదండరాం ఆవేదన వ్యక్తం చేశారు. మార్చ్‌కు అనుమతిచ్చిన ప్రభుత్వమే, మళ్లీ అడ్డుకోవడానికి పోలీసులతో తెలంగాణవాదులపై దాడులు చేయించిందని ఆరోపించారు. చివరిగా జేఏసీ నాయకుడు మల్లేపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ మార్చ్‌ను అడ్డుకోవడంలో ‘ప్రభుత్వం ఓడింది.. తెలంగాణ గెలిచింది’ అంటూ నినదించగా, తెలంగాణవాదులు కూడా ఆయనను అనుసరిస్తూ వేదిక నుంచి బయలుదేరారు. ఏదేమైనా తెలంగాణ మార్చ్ రాజ్యానికి ముచ్చెమటలు పోయించి, విజయవంతమైంది.