సాగునీటి రంగం బలపడితేనే మేలు

ఎన్నోవిధాలుగా రైతాంగాన్ని ఆదుకోవడం కెసిఆర్‌ ప్రభుత్వం కృషిచేస్తున్నది. అయినా విపక్షాల తీరు మారడంలేదు. పదేపదే ప్రభుత్వంపై నిరాధారమైన ఆరోపణలు చేస్తూ రైతాంగానికి ఉపయోగపడే ప్రాజెక్టుల నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నాయి. కోర్టులకు వెళ్లి అడ్డుకుంటున్నారు. రైతుల మేలుకోరే పార్టీలు ప్రభుత్వానికి సహకరించాలి తప్ప వ్యతిరేకంగా పోరాడటం అభివృద్దిని అడ్డుకోవడమే అవుతుంది. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిపై సవిూక్షించుకోవాల్సిన బాధ్యత విపక్షాలపై ఉన్నది. లేకుంటే రానున్న కాలంలో రైతులు తమ ఆగ్రహాన్ని చూపే అవకాశం ఉంది. సాగునీటి రంగం బలపడితేనే రైతాంగం బాగుపడుతుంది. వరదలు వచ్చి నదులుపొంగి సముద్రంలోకి నీరు పోకుండా దానిని ఒడిసి పట్టుకునే నదుల అనుసంధానం వేగం అందుకోవాలి. ఇతరత్రా పథకాలకన్నా ఇలాంటి బహుళార్థసాధక ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వాలి. కానీ తెలంగాణలోని రైతాంగం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నదనే చెప్పాలి. సంక్షేమ రంగానికి ఇస్తున్న ప్రాధాన్యం రైతాంగ అభివృద్ధిపై దృష్టిపెట్టడం ద్వారా రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న నీటి ప్రాజెక్టులు వేగంగా నిర్మాణ మవుతున్నాయి. కోటి ఎకరాలకు నీరు అందించాలన్న లక్ష్యంతో సాగుతోంది. ముఖ్యంగా తెలంగాణలో అత్యంత వెనుకబడిన పాలమూరు ప్రాంతం అభివృద్ధికి నోచుకోక పోవడానికి గత పాలకుల నిర్లక్ష్యమని చెప్పక తప్పదు. పాత మహబూబ్‌నగర్‌ జిల్లాలోని కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టుల కింద గత పాలకులు కేవలం 33,500 ఎకరాల కొత్త ఆయకట్టుతో పాటు మరో 12 వేల పాత ఆయకట్టుకు నీరందించారు. కానీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి న మొదటి ఏడాదిలోనే ఏకంగా 3,94,500 ఎకరాలు కొత్త ఆయకట్టుకు సాగునీరు అందించింది. అంతేకాదు గతేడాదిలో అదనంగా 4.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈ మధ్యకాలంలో ఏకంగా ఎనిమిది లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు కృత నిశ్చయంతో పనిచేయడమే కాకుండా నిరంతర పర్యవేక్షణ వల్ల పనులు వేగవంతం అవుతున్నాయి. ఇందుకోసం మంత్రి హరీష్‌ రావు నిరంతరంగా పనులను పర్యవేక్షిస్తున్నారు. గ్రామాల్లో మిషన్‌ కాకతీయ పనులు వేగం పుంజుకున్నాయి. రెండో దశ పనులు పూర్తికావడంతో చెరువుల్లో నీటి నిల్వ సామర్థ్యం పెరిగింది. అంతేకాదు భూగర్భ జలాల మట్టాలు పైకి రావడంలో ఈ రెండు వనరుల కింద లక్షల ఎకరాల పంట సాగయింది. అలాగే ఈ ఏడాదికాలంలో భారీ నీటి ప్రాజెక్టుల ద్వారా అదనంగా 9.67 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వడంతో పాటు చెరువుల కింద మరో మూడు లక్షల ఎకరాలకు పైగా పంటలకు సాగునీరు ఇవ్వనున్నది. దశాబ్దాలుగా దగాపడుతున్న రైతులకు ఊరట దక్కాలి. తెలంగాణలో రైతులను ఆదుకునేలా చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలు ఇచ్చేలా ప్రతి ఒక్కరూ చేయి వేయాలి.అటు రైతులకు ఇటు వినియోగదారులకు లాభముండేలా తెలంగాణ ప్రభుత్వం విత్తన భాండాగారం కోసం యత్నాలు మొదలు పెట్టింది. తెలంగాణలో నేలలు విత్తనాలకు అనుకూలం. ఆహారధాన్యాలు, నిత్యావసర కూరగాయల ఉత్పత్తి, వినియోగాలలో గ్రామాలను స్వయం పోషకాలుగా అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ముందుకెళుతున్నది. గ్రామ జనాభా ఎంత? ఏయే ఆహారధాన్యాలు, కాయగూరలు ఎంత మొత్తంలో అవసరం? అందుకు రైతులకు కావలసిన మౌలికసదుపాయాల కల్పనపై దృష్టి సారించింది. తద్వారా సవిూప భవిష్యత్తులో రైతులకు గిట్టుబాటు ధరలు అందుతాయి. సరసమైన ధరలకే వ్యవసాయ ఉత్పత్తులు వినియోగదారులకు లభించనున్నాయి. దేశాభివృద్ధి నమూనాలో వ్యవసాయ రంగం కీలకమైంది. దీనిపై కోట్లాది ప్రజలు ఆధారపడి జీవిస్తున్నారు. ఇప్పుడున్నటువంటి కరువు కాటకాల మధ్య వ్యవసాయం కాస్త కుదేలవుతున్న పరిస్థితి కనబడుతున్నది. వ్యవసాయరంగం సంక్షోభంలో కూరుకపోవడం వల్ల పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించకపోవడం ఆర్థికంగా చితికిపోయిన రైతన్నలు తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. దేశంలో అమలవుతున్న రైతు వ్యతిరేక విధానాలు కావచ్చు లేదా ఆయా రాష్ట్రాల్లో కొనసాగుతున్న విధానాల వల్ల రైతాంగం తీవ్రస్థాయిలోనే నష్టపోతున్నది. అందరూ రైతులను మోసం చేద్దామనుకుంటున్న వారే. అందరూ అందిన కాడికి అతడి నుంచి దోచుకుందా మనుకుంటున్న వారే…విత్తనాల కొనుగోలు దగ్గర నుంచి పంటను అమ్ముకునేవరకు అధికార, అనధికార వర్గాలు దోచుకోవం పరిపాటిగా మారింది. అందుకే జీవితాంతంత కష్టపడ్డా నాలుగు రాళ్లు వెనకేసుకోలేక పోతున్న వర్గం ఏదైనా ఉందంటే అది రైతువర్గమే. మొన్నటికి మొన్న కందులు, మిర్చి పండించిన రైతులు ఎలా దగాపడ్డారో చూశాం. వారికి గిట్టుబాటు ధరలు ఇవ్వడానికి కేంద్రం కూడా వెనకడుగు వేసింది. అలాగే తాజాగా నకిలీ విత్తనాలు రాజ్యమేలాయి. భారీగా నకిలీ విత్తనాల అమ్మకం జరిగినట్లు తేలింది. ఇలా ప్రతి ఒక్కరూ మోసం చేస్తూ పోతే అన్నం పెట్టే చేతులు ఆగ్రహిస్తే ఏం కావాలి. రైతులు వీధుల్లో తమ నిరసనలు వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వానికి కానరావడం లేదు. రైతులంటే నిర్లక్ష్యం రాజ్యం ఏలుతోంది. ఈ ధోరణి మారితేనే వ్యవసాయరంగం ముందుకు సాగగలదు. ప్రధాన సమస్యలు గుర్తించి అందుకు అనుగుణంగా ప్రభుత్వాలు నడుచుకోవాలి. వ్యవసాయాధిరత పరిశ్రమలకు ప్రోత్సాహం ఇవ్వాలి. అప్పుడే నిరుద్యోగ సమ్యకూడా తీరగలదు.