సాదాసీదాగా మండల సర్వ సభ సమావేశం

సాదాసీదాగా మండల సర్వ సభ సమావేశం

సంగెం: అక్టోబర్ 06 (జనం సాక్షి)
మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపిపి కందగట్ల కళావతి అధ్యక్షతన శుక్రవారం రోజున మండల సర్వసభ్య సమావేశం సాదా సీదాగా సాగింది.గ్రామీణ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక వసతులు,ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు,తదితర అంశాలపై ప్రతి మూడు నెలలకోసారి నిర్వహించే ఎంపీడీఓ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నామమాత్రంగా సాగింది.పూర్తి స్థాయిలో ప్రజా ప్రతినిధులు రాక,వచ్చిన వారితోనే సమావేశాన్ని తూ తూ మంత్రంగా నిర్వహించి చేతులు దులుపుకున్నారు.ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మూడు నెలలకు ఒకసారి నిర్వహించాల్సిన సర్వసభ్య సమావేశానికి పూర్తి స్థాయిలో ప్రజా ప్రతినిధులు హాజరు కాకపోవడం పలువురిని విస్మయానికి గురి చేసింది.మండల సరసభ్య సమావేశానికి పూర్తి స్థాయిలో ప్రజా ప్రతినిధులు హాజరు కాకపోవడంతో ప్రజల సమస్యలను వివరించే వారు లేరని,అధికారులు ఆడిందే ఆట-పాడిందే పాటగా మారిందని ప్రజలు వాపోతున్నారు.మండల సర్వసభ్య సమావేశంలో మండల సమస్యలపై కానీ అభివృద్ధి పై కానీ సమగ్రంగా చర్చ జరిగిన దాఖలాలు లేవని వాపోతున్నారు.మండలంలో ఎలాంటి అభివృద్ధి పనులు జరిగినవి,జరుగుతున్నాయో మండల ప్రజలకు తెలియదు.సర్వసభ్య సమావేశంలో అభివృద్ధి పనులకు,వచ్చిన నిధులపై ఖర్చు అయిన తీరుపై సమావేశంలో ఇప్పటివరకు ఎవరూ అడిగి చర్చకు దారి తీసిన దాఖలాలు కనిపించడం లేదని ప్రజలు చెబుతున్నారు.దీనివల్ల సర్వసభ్య సమావేశం ప్రతిసారి నామమాత్రంగానే జరుగుతుంది.మండల సర్వసభ్య సమావేశంలో కొందరు అధికారులు మాత్రమే సమావేశం ఏర్పాటు చేసుకొని వారు మాత్రమే నామమాత్రంగా వివరాలు చెప్పుకొని గంట సమయంలోనే సమావేశం ముగించుకుంటున్న పరిస్థితులు మండలంలో నెలకొన్నాయి.ఇప్పటివరకు జరిగిన సర్వసభ్య సమావేశంలో చేసిన తీర్మానాలు అవి అమలు అయిన తీరు ఎవరికి తెలియవు.ఈ సమావేశంలో సమస్యలపై చర్చకు దారి తీసే నాయకులే మండలంలో కరువయ్యారు.గ్రామపంచాయతీ గురించి సర్పంచులు ఎంపీటీసీలు కానీ చర్చించే ప్రస్తావన కొరవడితే,మండల పరిషత్ లోని అభివృద్ధి నిధుల గురించి చేసే పనుల గురించి సర్పంచులు అడిగే ప్రస్తావన లేదు.దీంతో మండలంలో అభివృద్ధి ఎక్కడ జరుగుతుందో ఎవరికి తెలిసే పరిస్థితి లేదు.కాబట్టి ఇప్పటికైనా మండల సర్వసభ్య సమావేశాన్ని పటిష్టంగా ఏర్పాటు చేసి మండలంలో వివిధ శాఖలు పనిచేస్తున్న తీరు,వాటి అభివృద్ధి, వచ్చిన నిధులపై సమగ్రమైన చర్చ జరగాలని ప్రజలు కోరుకుంటున్నారు.కొన్ని శాఖల అధికారులు సమావేశానికి గైర్హాజరు కావడంతో ఎంపిపి ప్రజాప్రతినిధులు అసహనం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో జెడ్పిటీసీ గూడా సుదర్శన్ రెడ్డి,వైస్ ఎంపిపి మల్లయ్య,ఎంపిడిఓ వెంకటేశ్వరావు,వివిధ గ్రామాల సర్పంచులు ఎంపిటీసీలు,వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు