సానియా జోడీ అద్భుత విజయం
సానియా-హింగిస్ జోడీ ఖాతాలో మరో విజయం
వరుసగా 26వ విజయం
బ్రిస్బేన్, జనవరి 9(జనంసాక్షి): అదే జోరు..అదే ఫలితం. సానియా-హింగిస్ జోడీ ఖాతాలో మరో విజయం వచ్చి చేరింది. 2016 సంవత్సరాన్ని ఈ జోడీ ఘనంగా ప్రారంభించింది. గతేడాది అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న సానియా విూర్జా(భారత్)-మార్టినా హింగిస్(స్విట్జర్లాండ్)ల జోడీ ఈ సీజన్ ను కూడా టైటిల్ తో శుభారంభం చేసింది. బ్రిస్బేన్ ఇంటర్నేషనల్ టోర్నీ ఫైనల్స్‌లో కెర్బర్, ఆండ్రియా పెట్కోవిచ్(జర్మనీ) జోడీని సానియా జోడీఓడించింది. శనివారం జరిగిన ఫైనల్ పోరులో సానియా-హింగిస్ ల ద్వయం 7-5, 6-1 పాయింట్ల తేడాతో వరుస సెట్లలో ఎంజెలిక్ కెర్బర్-ఆండ్రియా పెట్కోవిచ్ (జర్మనీ) జంటపై విజయం సాధించి టైటిల్ ను ఖాతాలో వేసుకుంది. తొలి సెట్ లో కాస్త ప్రతిఘటన ఎదుర్కొన్న ఈ వరల్డ్ నంబరవన్ జోడీ.. ఆ తరువాత రెండో గేమ్ ను మాత్రం ఎటువంటి అవకాశం ఇవ్వకుండా చేజిక్కించుకుంది. ఇది సానియా-హింగిస్ జంటకిది వరుసగా 26వ విజయం. దీంతో 2012లో సారా ఎరాని-రొబెర్టా విన్సీ (ఇటలీ) జంట వరుసగా 25 మ్యాచ్‌ల్లో గెలిచిన రికార్డును సానియా-హింగిస్ జోడీ బ్రేక్ చేసింది. ఇదిలా ఉండగా ఈ ఇద్దరి కలిసి సాధించిన టైటిల్స్ సంఖ్యను 10కు పెంచుకుంది.