సానియా జోడీ జైత్రయాత్ర
– ఆస్ట్రేలియా ఓపెన్ కూడా కైవసం
– వరుసగా8 టైటిళ్లు, 36 విజయాలు
మెల్‌బోర్న్,జనవరి29(జనంసాక్షి): సాన్‌టినా.. ప్రపంచ టెన్నిస్‌లో ఎదురులేని జోడి. వీరిద్దరూ కోర్టులో అడుగుపెట్టారంటే ప్రత్యర్థులకు చెమటలు పట్టాల్సిందే. గతేడాది నుంచి అలవోకగా విజయాలు సాధిస్తున్న ఈ జోడీ టెన్నిస్ చరిత్రలో సరికొత్త రికార్డులు సృష్టించారు. ఇప్పటికే వరుసగా ఏడు టైటిళ్లు దక్కించుకున్న ఈ జోడి.. తాజాగా ఆస్ట్రేలియా ఓపెన్ రూపంలో మరో టైటిల్‌ను తమ ఖాతాలో వేసుకుంది. ఈ ఏడాదిలో సాన్‌టినాకు ఇది వరుసగా మూడో గ్రాండ్‌స్లామ్. శుక్రవారం జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్ మ్యాచ్‌లో సాన్‌టినా ద్వయం ఆంద్రియా- లూసీ హ్రదేకాపై 7-6, 6-3తో గెలుపొందింది. దీంతో వరుసగా ఎనిమిదో టైటిల్‌ను దక్కించుకుందీ జోడి. ఈ గెలుపుతో సాన్‌టినా ఖాతాలో వరుసగా 36 విజయాలు చేరాయి. ఇప్పటికే గత 26ఏళ్లలో అత్యధిక వరుస విజయాలు సాధించి గుర్తింపు తెచ్చుకున్న ఈ జోడీ..మరో సరికొత్త రికార్డుకు సిద్ధమవుతోంది. మరో ఐదు విజయాలు సాధిస్తే.. టెన్నిస్‌లో అత్యధిక వరుస విజయాలు సాధించిన జోడిగా సాన్‌టినా ప్రపంచ రికార్డు సృష్టించనుంది. ఇండో-స్విస్ జోడి సానియా-హింగిస్‌లు ఏడాదిన్నర కాలం నుంచి అప్రతిహత విజయాలతో దూసుకెళ్తున్నారు. గతేడాది వింబుల్డన్, యూఎస్ ఓపెన్ సహా.. తొమ్మిది టైటిళ్లను దక్కించుకున్నారు. అదే ఉత్సాహంతో 2016లోకి అడుగుపెట్టిన ఈ జోడి ఇప్పటికే రష్యా, బ్రిస్బేన్ టైటిళ్లను తమ ఖాతాలో వేసుకుంది. తాజాగా ఆస్ట్రేలియా ఓపెన్‌తో హ్యాట్రిక్ విజయం సాధించింది.