సాయిరెడ్డిని మరో విడత ప్రశ్నించిన (ఈడీ) అధికారులు

న్యూఢిల్లీ : జగన్‌ అక్రమాస్తుల కేసులోరెండో నిందితుడు, ఆడిటర్‌ విజయసాయి రెడ్డిని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు మరో విడత ప్రశ్నించారు. మంగళవారం ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో సుమారు నాలుగున్నర గంటలపాలు విచారణ జరిగింది. కన్నన్‌, మాధవ్‌ రామచంద్ర, ఏకే దండమూడిల పెట్టుబడులు, అక్రమాస్తుల కేసులో వారి పాత్ర గురించి సాయిరెడ్డిని ప్రశ్నించినట్లు తెలిసింది. కొన్ని ప్రశ్నలకు లిఖితపూర్వకంగా సమాధానాలు రాబట్టింది.
మధ్యాహ్నం 12.30 గంటలకు ఈడీ విచారణకు హాజరైన సాయిరెడ్డి.. సాయంత్రం 5 గంటలకు బయటకు వచ్చారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… ”సీబీఐ చార్జిషీటుకు సంబంధించి పలు ప్రశ్నలు అడిగారు. నేను సమాధానాలు ఇచ్చాను. వాన్‌పిక్‌కు భూముల కేటాయింపుపై మరిన్ని వివరణలు కావాలని ఈడీ తెలిపింది. ఆ వివరాలు చెప్పేందుకు ఈనెల 16వ తేదీన మళ్లీ ఢిల్లీకి వస్తాను” అని తెలిపారు.
మరోవైపు… సాయిరెడ్డి బెయిల్‌ రద్దుపై తాము దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను త్వరగా పరిష్కరించాలని సుప్రీం కోర్టును సీబీఐ కోరింది. దీనిని పరిశీలిస్తామని ధర్మాసనం పేర్కొంది.