సారా విక్రయాలను నియంత్రించండి

ఖమ్మం, జూలై 31 : ఖనాపురం, హవెల్లి పంచాయతీ పరిధిలోని వరదయ్య నగర్‌లో నాటుసారా విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. నాగార్జునసాగర్‌ చిన్న కాల్వపై కొంత మంది నివాసాలు ఏర్పాటు చేసుకున్న విషయం విదితమే. ఈ కాల్వపై ఇళ్లు నిర్మించుకున్న సదరు వ్యక్తుల్లో కొంత మంది సులభంగా డబ్బు సంపాదించుకోవాలనే ఆలోచనతో సారా విక్రయాలను విచ్చలవిడిగా సాగిస్తున్నారు. సారా తాగిన వ్యక్తులు ఆ కాలనీల్లో నివాసాలకు వెళ్లి మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఆసుపత్రికి వెళ్లే ప్రధాన రహదారి పక్కనే ఈ సారా అమ్మకాలు జరుగుతున్నా ఎక్సైజ్‌ శాఖ అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం కూడా పలు అనుమానాలకు దారితీస్తోంది. లక్షలు వెచ్చించి నిర్మాణాలు చేసుకొని నివసిస్తున్న మధ్య తరగతి కుటుంబీకులు ప్రతిరాత్రి బిక్కుబిక్కుమంటు కాలం వెళ్లదిస్తున్నారు. ఇదే విషయాన్ని ఎక్సైజ్‌ శాఖ అధికారులకు పలుమార్లు కాలనీ వాసులు మొరపెట్టుకున్నా ఈ సారా విక్రయాలను నియంత్రించే నాధుడే కరువైన్నాడు. ఇప్పటికైన ఎక్సైజ్‌ శాఖ అధికారులు స్పందించి కాలనీల్లో సారా విక్రయాలను నివారించాలని కోరుతున్నారు.