సార్వాత్రిక సమ్మె సక్సెస్
– దేశవ్యాప్తంగా స్థంభించిన జనజీవనం
న్యూఢిల్లీ/హైదరాబాద్,సెప్టెంబర్ 2(జనంసాక్షి): దేశ వ్యాప్తంగా కార్మిక సంఘాల సార్వత్రిక సమ్మెతో జనజీవనం స్తంభించింది. రవాణా రంగం పూర్తిగా మూసుకుపోయింది. కార్మిక సంఘాల సమ్మె జనజీవనంపై తీవ్ర ప్రభావం చూపింది. ఎక్కడిక్కడ వ్యాపార వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి. కనీస వేతనాల అమలు, కార్మిక చట్టాలకు తూట్లు పొడవడాన్ని నిరసిస్తూ ఆందోళనకు దిగారు. బ్యాంక్ ఉద్యోగులు కూడా ఆందోళనలో పాలుపంచుకోవడంతో బ్యాంకులు మూతపడ్డాయి. లావాదేవీలు ఆగిపోయాయి. కొన్ని రాష్టాల్ల్రో రైళ్లు, బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. సుమారు 15 కోట్ల మంది కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు. కనీస వేతనాన్ని 18 వేలు చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. సామాజిక భద్రతను కల్పించాలని అసంఘటిత కార్మికలు కూడా డిమాండ్ చేస్తున్నారు. మొత్తం 10 కార్మిక సంఘాలు బంద్‌కు పిలుపునిచ్చాయి. కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ ధర్నా నిర్వహిస్తున్నారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు బంద్‌ను పాటిస్తున్నారు. కార్మిక చట్టాలను మార్చాలంటున్నారు. ఆర్టీసీ కార్మిక సంఘాలన్నీ సమ్మెలో పాల్గొనడంతో జంటనగరాల్లో బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. ఆర్టీసీ కార్మికులంతా స్వచ్ఛందంగా విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు. ఆర్టీసీ బస్సులు తిరగకపోవడంతో ప్రయాణికులు ప్రైవేటు వాహనాల ద్వారా గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలోని సింగరేణి కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. దీంతో దాదాపు 40వేల మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. సమ్మె కారణంగా సింగరేణికి దాదాపు రూ.10 కోట్ల నష్టం వాటిల్లింది. ఆంధప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక సమ్మె ప్రభావం పాక్షికంగా ఉంది. కర్నూలులో ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ సమ్మెలో పాల్గొనగా.. మజ్దూర్ యూనియన్ కార్మికులు సమ్మెకు మద్దతుగా ఎర్రబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. కార్మికులు డిపో ఎదుట నిరసన చేపట్టారు. కడప జిల్లాలో సమ్మె ప్రభావం పెద్దగా లేదు. ఎంప్లాయీస్, మజ్దూర్ యూనియన్ కార్మికులు ఎర్రబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు యథావిధిగా నడుస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో సమ్మె పాక్షికంగా జరుగుతోంది. కొత్తూరు జూట్ మిల్లులో పనిచేస్తున్న 5వేల మంది జూట్ కార్మికులు విధులకు హాజరుకాకుండా సామూహిక సెలవు పెట్టడంతో యంత్రాలు ఆగిపోయాయి. తెలంగాణలో ఆర్టీసీ బస్సులను నిలిపేశారు. బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. ఇకపోతే పశ్చిమ బెంగాల్‌లోని బెహర్ జిల్లాలో నిరసనకారులు ఎన్‌బీఎస్టీసీ స్కూల్ బస్సును ధ్వంసం చేశారు. కేరళలోని తిరువనంతపురంలో అంతరాష్ట్ర బస్సులను నిలిపివేశారు. దేశవ్యాప్త సమ్మెకు మద్దతు ఇవ్వడం లేదని భారతీయ మజ్దూర్ సంఘ్ నేత పవన్ కుమార్ తెలిపారు. బెంగళూర్‌లోని శివారు జిల్లాలో స్కూళ్లు, కాలేజీలను బంద్ చేశారు. బంద్ వల్ల బెంగుళూర్‌లో సాధారణ జీవనం స్తంభించింది. ఒడిశాలోని భువనేశ్వర్ రైల్వే స్టేషన్‌లో రైళ్లు నిలిచిపోయాయి. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలోనూ రోడ్డు ఉద్యోగులు స్టయ్రిక్ పాటిస్తున్నారు. దాని వల్ల జనజీవనం స్తంభించింది. సిమ్లాలో ఆపిల్ లారీలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. దీనికి తోడు అక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి.




