సింగరేణి కార్మికులకు 21 శాతం బోనస్‌

5

హైదరాబాద్‌,సెప్టెంబర్‌24(జనంసాక్షి):

సింగరేణి కార్మికులకు సిఎం కెసిఆర్‌ శుభవార్త అందించారు.  సింగరేణి కాలరీస్‌ కంపెనీ లాభాల్లో కార్మికులకు వాటా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు  సింగరేణిపై సీఎం తన అధికార నివాసంలో సవిూక్ష నిర్వహించారు. కంపెనీ ఈయేడాది సాధించిన లాభాల్లో సింగరేణి కార్మికులకు 21 శాతం వాటా ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అదే విధంగా 1990 నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వానికి బకాయి ఉన్న రూ.175 కోట్ల వృత్తిపన్నును కూడా రద్దు చేస్తున్నామన్నారు. కార్మికుల నుంచి వృత్తి పన్నును వసూలు చేయొద్దని పేర్కొన్నారు. ఈయేడాది కంపెనీ రూ.491 కోట్లు లాభాలు గడించిందని దీనిలో 21 శాతం అంటే రూ.103 కోట్లు కార్మికులకు చెల్లిస్తామన్నారు. 60 వేల మంది కార్మికులకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు అందుతుందని వివరించారు. ఈ సమావేశానికి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నేతలు, ఆ సంఘం గౌరవ అధ్యక్షురాలు, ఎంపీ కల్వకుంట్ల కవిత, సింగరేణి సీఎండీ శ్రీధర్‌, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు తదితరులు హాజరయ్యారు.