సింగరేణి లాభాల్లో కార్మికులకు 29శాతం వాటా
` ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయం
` దసరాకన్నా ముందే చెల్లించాలని సిఎండీ శ్రీధర్‌కు ఆదేశం
` కార్మికుల భవిష్యత్తు దృష్ట్యా సంస్థ కార్యకలాపాలను విస్తృతపరచాల్సిన అవసరముందని వెల్లడి
హైదరాబాద్,అక్టోబరు 5(జనంసాక్షి):సింగరేణి సంస్థ ఈ ఏడాది ఆర్జించిన లాభాల్లో కార్మికులకు 29 శాతం వాటాను ఇవ్వాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. గత ఏడాది కంటే ఒకశాతం పెంచుతూ సింగరేణి కార్మికులకు సిఎం కెసిఆర్ దసరా కానుకను అందించారు. ఈ లాభాల్లో వాటాను దసరాకన్నా ముందే చెల్లించాలని సిఎండీ శ్రీధర్ ను ముఖ్యమంత్రి ఆదేశించారు. సింగరేణి కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి వుందని సిఎం పునరుద్ఘాటించారు. కార్మికుల భవిష్యత్తు దృష్ట్యా సింగరేణి సంస్థ కార్యకలాపాలను విస్తృతపరచాల్సిన అవసరమున్నదన్నారు. బొగ్గుతవ్వకంతో పాటు ఇసుక,ఇనుము, సున్నపురాయి తదితర ఖనిజాల తవ్వకాల్లోకి సింగరేణి విస్తరించాల్సిన అవసరమున్నదని సిఎం తెలిపారు. మంగళవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన సింగరేణిపై సవిూక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి కొప్పుల ఈశ్వర్, పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత, ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వర్ రావు, దివాకర్ రావు, గండ్ర వెంకటరమణారెడ్డి, హరిప్రియ నాయక్, దుర్గం చిన్నయ్య, ఆత్రం సక్కు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్ రావు, సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) రాష్ట్ర అధ్యక్షుడు బి.వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి, సంఘం నాయకులు కెంగర్ల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ… బొగ్గుగని మైనింగ్, పవర్ జనరేషన్ నిర్వహణలో దేశంలోనే ఉన్నత స్థానంలో సింగరేణి సంస్థను నిలపడంలో కార్మికుల శ్రమ నైపుణ్యం ఎంతో గొప్పదని సిఎం అన్నారు. నిబద్దతతో నిరంతర శ్రమ చేస్తున్న సింగరేణి కార్మికుల సంక్షేమం, వారి భవిష్యత్తుకోసం తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి వున్నదన్నారు. సింగరేణి కార్మికుల నైపుణ్యాన్ని బొగ్గుతవ్వకంలోనే కాకుండా ఇసుక సున్నపురాయి ఇనుము తదితర ఖనిజాల తవ్వకాలలో వినియోగించుకోవాల్సిన సందర్భం వచ్చిందన్నారు. ఇందుకు సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను సిఎం కెసిఆర్ ఆదేశించారు. ‘‘ ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీల వాళ్లు మన రిటైరయిన సింగరేణి కార్మికులను వినియోగించుకుని బొగ్గు తదితర ఖనిజాలను నిర్వహిస్తున్నారు.లాభాలు గడిస్తున్నారు. మనమే ఎందుకు ఆ పని చేయకూడదు? లాభాలు వచ్చే అవకాశమున్న ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం ప్రయివేట్ పరం చేస్తుండడం శోచనీయం. తెలంగాణ ప్రభుత్వం సింగరేణి కార్మికుల సంక్షేమాన్ని, సంస్థ మనుగడను దృష్టిలో ఉంచుకుని పనిచేస్తుంది. వారి నైపుణ్యాన్ని,శక్తిని తెలంగాణ ప్రభుత్వం తప్పకుండా వినియోగించుకుంటుంది. బొగ్గుతోపాటు రాష్ట్రంలో నిల్వలున్న ఇతర మైనింగ్ రంగాలను నిర్వహిస్తూ కార్మికులకు పనికల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా చర్యలు చేపడుతుంది.’’ అని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు.సింగరేణి సంస్థలో పనిచేసి రిటైరయిన కార్మికులు, ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ సంస్థ ద్వారా అందుతున్న పింఛను రెండు వేల లోపే ఉందని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైనా సాయం చేసేందుకు చర్యలు చేపట్టాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ చేసిన విజ్జప్తి పట్ల సిఎం కెసిఆర్ సానుకూలంగా స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టడం ద్వారా సింగరేణి రిటైర్డ్ కార్మికులు ఉద్యోగులకు సాయం చేయగలమో.. నివేదికను తయారు చేయాలని అధికారులను సిఎం కెసిఆర్ ఆదేశించారు.
(లాభాల్లో వాటాను ప్రకటించినందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కు ధన్యవాదాలు తెలుపుతున్న సింగరేణి కోల్ బెల్టు ఏరియా ప్రజాప్రతినిధులు , టిజిబికెఎస్ నేతలు)