సింగూర్‌ జలాలు తరలిస్తే అడ్డుకుంటాం

నిజామాబాద్‌, అక్టోబర్‌ 31 : ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి లోపాయికారి ఒప్పందం వల్ల సింగూరు జలాలను అదనంగా తరలించే యత్నాన్ని అడ్డుకుంటామని టిడిపి రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి, నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు వెల్లడించారు. బుధవారం జిల్లా టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిజాంసాగర్‌ ఆయకట్టు      స్థిరీకరణ కోసం మెదక్‌ జిల్లాలో సింగూర్‌ ప్రాజెక్టును నిర్మించారని, అయితే ఈ ప్రాజెక్టు నుంచి హైదరాబాద్‌కు తాగునీరు, మెదక్‌ జిల్లాకు సాగునీటి కోసం, అదే విధంగా నిజాంసాగర్‌ ఆయకట్టు కోసం నీటి కేటాయింపులు జరిగాయని ఆయన అన్నారు. అయితే కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ఈ కేటాయింపును తొంగలతొక్కి హైదరాబాద్‌, మెదక్‌కు నీటిని తరలిస్తున్నారని ఆరోపించారు. తాజాగా మరో రెండు టీఎంసీల నీటిని మళ్లించేందుకు ముఖ్యమంత్రి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి నీటి కేటాయింపులకు పచ్చజెండా ఊపడం సిగ్గుచేటన్నారు. ఈ విషయంలో ప్రభుత్వ ఉద్దేశం, ఒప్పందాలను వెల్లడించాలని జిల్లాకు చెందిన నీటిపారుదల శాఖమంత్రి వాస్తవాలను బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. సింగూర్‌ జలాలపై జరుగుతున్న అన్యాయాన్ని డిఆర్‌సి సమావేశాల్లో మంత్రులను నిలదీస్తామని వెంకటేశ్వరరావు వెల్లడించారు. జిల్లాలో భూ పంపిణీ చేయడం లేదని మంత్రి రఘువీర ప్రకటించడాన్ని తీవ్రంగా ఖండించారు. ధాన్యం కొనుగోలులో హమాలీలకు ప్రభుత్వమే కూలీ చెల్లించాలని, ఉన్న జీవోను అమలు చేయాలని ఆయన కోరారు. విలేకరుల సమావేశంలో టిడిపి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ గంగాధర్‌గౌడ్‌, నాయకులు శంకర్‌, నరేందర్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.