సిఎం ముఖాముఖికి సర్వం సిద్ధంజీడిసాగు రైతుల్లో చిగురిస్తున్న ఆశలు!
శ్రీకాకుళం, జూలై 27: శ్రీకాకుళం జిల్లాలో ఇందిరమ్మ బాట నిమిత్తం ముఖ్యమంత్రి కిరణ్ శుక్రవారంనాడు జిల్లాకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి జీడిసాగు రైతులతో ముఖాముఖి చర్చ నిర్వహించనున్నారు. ఈ చర్చలకు వేదిక కానున్న పలాస మండలం రామకృష్ణపురం గ్రామంలో జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇదిలా ఉండగా ముఖాముఖి ద్వారా జీడిసాగుపై ఎదుర్కొంటున్న పలు సమస్యలకు పరిష్కారం లభించనున్నదని రైతులు ఎదురుచూస్తున్నారు. ముఖ్యమంత్రి నేరుగా రైతులతో ముఖాముఖి చర్చించడం వల్ల పంట సాగులో సమస్యలు, మార్కెటింగ్ సౌకర్యం, గిట్టుబాటు ధర కల్పన తదితర సమస్యలను స్వయంగా తెలుసుకుని వాటి పరిష్కారానికి తగు చర్యలు తీసుకునే అవకాశం ఏర్పడనున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా జిల్లాలో జీడిసాగు, దిగుబడి, జీడి పరిశ్రమ, ప్రోసెసింగ్ యూనిట్లు, ఉద్యోగ, ఉపాధి కల్పన, సాగు ప్రోత్సాహానికి, రైతుల సంక్షేమానికి ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాలను ఒకసారి సింహావలోకం చేసుకుందాం. రాష్ట్రంలో జీడిసాగుకు, జీడి పరిశ్రమకు శ్రీకాకుళం జిల్లా పలాస మండలం ప్రధాన కేంద్రం. జీడిసాగుకు అనువైన వాతావరణం కలిన జిల్లాలో సుమారు 23, 355 హెక్టార్లలో జీడిపంట సాగవుతోంది. ఏడాదికి సరాసరిన హెక్టారుకు 600 కిలోల చొప్పున మొత్తం 13,759 మెట్రిక్ టన్నుల జీడి దిగుబడి సాగుతోంది. గణనీయంగా ఉత్పత్తి అవుచున్న జీడి పిక్కలను శుద్ధి చేసి తినేందుకు అనువుగా ప్రోసెస్ చేసేందుకు సుమారు 110 జీడి పరిశ్రమలు, 134 జీడి ప్రోసెసింగ్ యూనిట్లు పలాస మండలంలో కేంద్రీకృతమైవున్నాయి. ఈ పరిశ్రమల ద్వారా ప్రత్యక్షంగా సుమారు 29వేల ఉపాధి అవకావాలు పొందుచుండగా, పరోక్షంగా ఎన్నో వేల మందికి ఈ పరిశ్రమ జీవనాధారమైంది. జీడి పరిశ్రమల్లో పనిచేసే వారికి సరైన వేతన సౌకర్యం కల్పించేందుకు అనువుగా పరిశ్రమల యాజమాన్యం, ఉద్యోగ సంఘాల ప్రతి రెండేళ్లకు ఒక్కసారి వేతన ఒప్పందాలను చేసుకునేలా కార్మిక శాఖ కీలక పాత్రను పోషిస్తున్నది. ఉద్యోగుల సంక్షేమానికి పలు సంక్షేమ పథకాలను రూపొందించి అమలు చేస్తోంది. జీడిసాగు రైతులను ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా ప్రోత్సహిస్తూ, వారిని అదుకొనేందుకు ఉద్యాన వన శాఖ ద్వారా పలు కార్యక్రమాలను రూపొందించి అమలు పర్చడం జరుగుచున్నది. జీడిసాగు పునరుజ్జీవన కార్యక్రమం, జీడి ప్రోసెసింగ్‌లో భాగంగా రోస్టింగ్ విధానం నుంచి బాయిలింగ్ విధానానికి మార్చు చేయడం, జీడి మొక్కల సంరక్షణకు అవసరమైన పరికరాలైన పవర్ టిల్లర్లు, థైవన్ స్పేయ్రర్లు తదితర పరికరాల పంపిణీకై పలు కార్యక్రమాలను జిల్లాలో అమలు పర్చడం జరుగుతోంది. జీడి సాగు పునరుజ్జీవన కార్యక్రమం కింద ఒక హెక్టారు విస్తీర్ణంలో జీడి పంట సాగు చేసేందుకు అయ్యే అంచనా వ్యయం రూ.20,000లో 50 శాతం ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందిస్తోంది. జీడి ప్రోసెసింగ్‌లో భాగంగా రోస్టింగ్ విధానం నుంచి బాయిలింగ్ విధానానికి మార్చు చేసేందుకు అయ్యే అంచనా వ్యయంలో 40 శాతం రాయితీని ప్రభుత్వం కల్పిస్తోంది. ఈ పథకం కింద ఈ ఏడాది ఇప్పటి వరకూ రూ.19.20 లక్షల ఆర్థిక సహాయాన్ని రాయితీగా అందిస్తోంది.అదే విధంగా జీడి మొక్కల సంరక్షణకు, వాటి నిర్వహణకు అవసరమైన పవర్ టిల్లర్లు, థైవాన్ స్పేయర్లు తదితర పరికరాల పంపిణీలో భాగంగా 50 శాతం రాయితీపై ప్రభుత్వం అందిస్తోంది. ఈ కార్యక్రమం కింద ఈ ఏడాది ఇప్పటివరకూ రూ.42.60 లక్షల ఆర్థిక సహాయాన్ని రాయితీగా అందించింది. ఇదిలా ఉండగా జీడిసాగు సమస్యల పరిష్కారానికి మార్గం సుగమం చేసే ముఖ్యమంత్రి ముఖాముఖి కోసం రైతులు ఆశాభావంతో ఎదురు చూస్తున్నారు.