సిక్కిం మాజీ గవర్నర్ రామారావు కన్నుమూత
– సీఎం కేసీఆర్ ప్రగాఢ సంతాపం
హైదరాబాద్,జనవరి17(జనంసాక్షి): భాజపా సీనియర్ నేత, సిక్కిం మాజీ గవర్నర్ వి. రామారావు(81) అనారోగ్యంతో హైదరాబాద్‌లో కన్నుమూశారు. జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. 1935 డిసెంబర్ 12న కృష్ణా జిల్లా మచిలీపట్నంలో రామారావు జన్మించారు. 1956లో జనసంఘ్‌లో చేరి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. భాజపాలో జాతీయ నాయకుడిగా ఎదిగారు. 2002 నుంచి 2005 వరకు సిక్కిం రాష్ట్ర గవర్నర్‌గా పనిచేశారు. 1966, 1972, 1978, 1984లో పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.
రామారావు భౌతికకాయానికి ప్రముఖుల నివాళి
సిక్కిం మాజీ గవర్నర్ రామారావు భౌతికకాయానికి మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు, కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్, ఏపీ శాసనమండలి ఛైర్మన్ చక్రపాణి, తెరాస సెక్రటరీ జనరల్ కె.కేశవరావు, తెదేపా ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి, భాజపా ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ ఎన్. రామచంద్రరావు తదితరులు నివాళులు అర్పించారు. తెలుగు రాష్ట్రాల్లో భాజపా, జనసంఘ్ విస్తరణకు రామారావు అవిశ్రాంతంగా కృషి చేశారని నిర్మలా సీతారామన్ గుర్తుచేశారు. రాజకీయాల్లో ఉన్నత విలువలు స్థాపించిన రామారావు జీవితం తనతోపాటు అనేకమందికి ఆదర్శప్రాయమని మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు కొనియాడారు
ప్రభుత్వ లాంఛనాలతో రామారావు అంత్యక్రియలు
రేపు మహాప్రస్థానం స్మశాన వాటికలో సిక్కిం మాజీ గవర్నర్ రామారావు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆయనకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు..
సీఎం కేసీఆర్ ప్రగాఢ సంతాపం
సిక్కిం మాజీ గవర్నర్ రామారావు మృతికి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. రామారావు అనేక మంది ఆదర్శమయ్యాడని తెలిపారు.
ఆయన భాజాపా, జనసంఘ్ పార్టీల విస్తరణకు విశేషమైన కృషి చేశారని కొనియాడారు.