సిద్ధూకు రెండు స్థానాల్లోనూ ఓటమి తప్పదు!

– భాజపానే అధికారం చేపడుతుంది
– కర్ణాటక మాజీ సీఎం యాడ్యూరప్ప
బెంగళూరు, జ‌నం సాక్షి : కర్ణాటకలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గరపడుతున్న కొద్దీ అధికార, విపక్ష పార్టీలు పరస్పర విమర్శలతో రాజకీయ హీటును పెంచుతున్నాయి. ఈ ఎన్నికల్లో అధికారం మాదంటే మాదని భాజపా, కాంగ్రెస్‌ నేతలు ఎవరి ధీమా వారు వ్యక్తంచేస్తున్నారు. ఈనేపథ్యంలో కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప ఓ ప్రముఖ ఛానెలతో మాట్లాడారు. కర్ణాటకలో ఎట్టిపరిస్థితుల్లోను భాజపా ప్రభుత్వమే వస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. 140 నుంచి 160 స్థానాలను భాజపా గెలుచుకుంటుందన్నారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు పోటీ చేస్తోన్న చాముండేశ్వరి, బాదామి రెండు నియోజకవర్గాల్లోనూ ఓటమి తప్పదని వ్యాఖ్యానించారు. మే 15 తర్వాత తానే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తానన్నారు. సిద్దిరామయ్య పాలనలో ప్రజలు విసిగిపోయారని, అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్‌ ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఉన్నారన్నారు. గతంలో తమ పాలన, ప్రస్తుతం కాంగ్రెస్‌ పాలను ప్రజలు బేరీజు వేసుకుంటున్నారని, బీజేపీ పాలనే మెరుగ్గా ఉందని అత్యధిక కన్నడీయులు భావిస్తున్నారని తెలిపారు. ఫలితంగా మేలో జరిగే ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో విజయం సాధిస్తారని యడ్యూరప్ప ఆశాభావం వ్యక్తం చేశారు.