సినిమా టిక్కెట్ రేట్ల నిర్ణయంపై చర్చించిన కమిటీ
మరోమారు జనవరిలో సమావేశం కావాలని నిర్ణయం
హడావిడి నిర్ణయం తీసుకోవద్దని సభ్యుల అభిప్రాయం
విజయవాడ,డిసెంబర్31 (జనంసాక్షి): ఆంధ్రప్రదేశ్లో సినిమా టిక్కెట్ రేట్ల నిర్ణయంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ తొలి భేటి శుక్రవారం జరిగింది. హోం శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి అధ్యక్షతన శుక్రవారం జరిగిన వర్చువల్ విూటింగ్ లో పాల్గొన్న సభ్యులు సినిమా టిక్కెట్ల ధరలు, థియేటర్లలోని మౌలిక వసతులు, ప్రేక్షకుల స్పందనపై ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తోంది. కమిటీలోని సభ్యుల అభిప్రాయాలను తెలుసుకున్న ఛైర్మన్ జనవరి రెండోవారంలో ప్రత్యక్షంగా సభ్యులందరితోనూ మరోసారి సమావేశం కావాలని నిర్ణయించినట్టు సమాచారం. సంక్రాంతికి విడుదలవుతున్న భారీ చిత్రాలను దృష్టిలో పెట్టుకుని హడావుడిగా టిక్కెట్ రేట్లపై నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదని, పూర్తి స్థాయిలో వివిధ వర్గాలతో చర్చించి, సహేతుకమైన పరిష్కారానికి రావాలని కమిటీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. సినిమా టిక్కెట్ రేట్లను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల తగ్గించడాన్ని నిరసిస్తూ కొందరు కోర్టుకు వెళ్ళిన సంగతి తెలిసిందే. అయితే కోర్టు ఉత్తర్వులతో సంబంధం లేకుండా కూలకషంగా చర్చించిన అనంతరమే ఓ నివేదికను ప్రభుత్వానికి ఇవ్వాలని కమిటీ సభ్యులు నిర్ణయించుకున్నారని అంటున్నారు. సినిమా టికెట్ రేట్లతో పాటు థియేటర్లలోని మౌలిక వసతులపైనా ఈ భేటీలో చర్చ జరిగినట్టు సమాచారం. సినిమా టిక్కెట్ రేట్లను భారీగా తగ్గించడంతో వాటి నిర్వహణ భారంగా పరిణమించిందని కమిటీలోని ఎగ్జిబిట్లర్లు ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్ళినట్టు తెలుస్తోంది. ఇదే క్రమంలో థియేటర్లను నడిపేలా సినీ నటుడు ఆర్ నానాయణ మూర్తి గురువారం మంత్రి పేర్ని నానితో చర్చించారు. దీంతో థియేటర్లను ఓపెన్ చేసి, లైసెన్సులు రెన్యువల్ చేసుకునేలా మంత్రి ఆదేశాలు ఇచ్చారు.