సిబిఐ వ్యవహారాలపై స్వతంత్ర దర్యాప్తు సాగాలి

అవినీతికి ఆస్కారం లేకుండా స్వతంత్రను కాపాడాలి

అప్పుడే ప్రజల్లో విశ్వాసం పాదుకొల్పగలం

న్యూఢిల్లీ,అక్టోబర్‌24(జ‌నంసాక్షి): సిబిఐ ఉన్నతాధికారులపై వచ్చిన ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తు జరిపించడం ద్వారా మోడీ ప్రభుత్వం చిత్తశుద్ది చాటుకోవాలి. దెబ్బతిన్న దర్యాప్తు సంస్థ ప్రతిష్టను పునరుద్ధరించాలి. అలాగే ప్రజల్లో కోల్పోయిన విశ్వాసాన్ని నిలబెట్టాలి. అంతకన్నా ముఖ్యంగా ప్రజాతంత్ర, రాజ్యాంగ బద్ధ సంస్థలను నిర్వీర్యం చేసేందుకు ఇంతకాలం జరగిన ప్రయత్నాలను ఇకనుంచి కట్టిపెట్టాలి. రాజ్యాంగ సంస్థలను, జవాబుదారీతనాన్ని, పారదర్శకతను, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోగలం అన్న నమ్మకాన్ని కల్పించాలి. సీబీఐ డీఎస్పీ దేవేందర్‌ కుమార్‌కు దిల్లీ న్యాయస్థానం ఏడు రోజుల రిమాండ్‌ విధించినట్లుగానే ఆస్థానా విషయంలో కూడా దర్యాప్తు సాగించాలి. విచారణ నిమిత్తం డిఎస్పీని అదుపులోకి తీసుకోవాలని పోలీసులకు సూచించింది. మరోవైపు ఆయనపై దాఖలైన ప్రాథమిక విచారణ నివేదిక లో తాజాగా బలవంతపు వసూళ్లు, ఫోర్జరీ తదితర అభియోగాలనూ సీబీఐ చేర్చింది. సీబీఐ ప్రత్యేక డైరెక్టర్‌ రాకేశ్‌ ఆస్థానాపై అవినీతి ఆరోపణలకు సంబంధించిన కేసులో దేవేందర్‌ను అధికారులు అరెస్టుచేసిన సంగతి తెలిసిందే. మరోవైపు మధ్యవర్తులు మనోజ్‌ ప్రసాద్‌, సోమేశ్‌ ప్రసాద్‌లనూ నిందితుల జాబితాలో కొత్తగా చేర్చింది. మరోవైపు తన అరెస్టును సవాల్‌చేస్తూ దిల్లీ హైకోర్టులో దేవేందర్‌ పిటిషన్‌ దాఖలుచేశారు. సీబీఐ డైరెక్టర్‌ అలోక్‌ కుమార్‌ వర్మ, సంయుక్త డైరెక్టర్‌ ఏకే శర్మ, సిబ్బంది, శిక్షణ విభాగాలను దీనిలో కక్షిదారులుగా చేర్చారు. తనపై నమోదైన ప్రాథమిక విచారణ నివేదికను కొట్టివేయాలని

అభ్యర్థించారు. ఇది కుట్రపూరిత, చట్టవిరుద్ధ ప్రాథమిక విచారణ నివేదిక. దీన్ని కొట్టివేసేలా ఆదేశాలు జారీచేయాలి. కేసుకు సంబంధించిన రికార్డులనూ పరిశీలించాలని పిటిషన్‌లో ఆయన కోరారు. ఆస్థానా దాఖలుచేసిన పిటిషన్‌తోపాటు కలిపి దీన్ని కోర్టు విచారించింది. మాంసం ఎగుమతుల వ్యాపారి మొయిన్‌ ఖురేషికి సంబంధించిన కేసులో గతంలో దర్యాప్తు అధికారిగా దేవేందర్‌ వ్యవహరించారు. ఈ కేసు నుంచి బయటపడేందుకు రూ.3 కోట్లు లంచం సమర్పించానని హైదరాబాద్‌ వ్యాపారి సాన సతీశ్‌ బాబు ఆరోపించారు. ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేయడంలో ఫోర్జరీకి పాల్పడినట్లు దేవేందర్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇవన్‌ఈన కూడా సిబిఐ పరువునే కాకుండా మోడీ ప్రభుత్వ ప్రతిష్టను కూడా మంటకలిపాయి. అందువల్ల ఇలాంటి వ్యవహారాలు ఇకముందు సాగకుండా మొత్తం వ్యవహారాలపై స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలి. సీబీఐలో అధికారుల మధ్య బహిర్గతమైన లుకలుకలు, పరస్పర అవినీతిఆరోపణలు వివిధ స్థాయులకు విస్తరిస్తున్నాయి. ప్రత్యేక డైరెక్టర్‌ రాకేశ్‌ ఆస్థానా.. సీబీఐ డైరెక్టర్‌ అలోక్‌ వర్మపై దుష్పవ్రర్తన, అవినీతి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. సంయుక్త డైరెక్టర్‌ ఎ.కె.శర్మపైనా ఆయన గురి పెట్టారు. గత నెలలో కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌ (సీవీసీ)కి లేఖ రాశారు. అభ్యంతరకర వ్యక్తులుగా సీబీఐజాబితాలో ఉన్నవారితో కలసి శర్మ కుటుంబ సభ్యులు డొల్ల కంపెనీలను నిర్వహిస్తున్నారని ఆరోపించారు. అయితే అవినీతి ఊబిలో చిక్కుకున్న దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐ డైరెక్టర్‌ అలోక్‌ వర్మ, ప్రత్యేక డైరెక్టర్‌ రాకేశ్‌ ఆస్థానాలను వెంటనే బాధ్యతల నుంచి తొలగించడం ద్వారా కొంత కదలిక తెచ్చారు. నిజానికి ఈ ఇద్దరూ ఇద్దరూ దేశ ప్రతిష్ఠను దెబ్బతీసేలా వ్యవహరించారు. సీబీఐలో నిజాయతీపరులున్నా, అవినీతీ ఉందని వీరు రుజువు చేశారు. సీబీఐలో జరుగుతున్న వ్యవహారాల్లో నిజాలను నిగ్గుతేల్చి, ప్రజలకు వివరించాల్సి ఉంది. ఇలాంటి ఘటనల వల్ల ఆయా సంస్థలు ప్రజల్లో విశ్వాసం కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. సీబీఐలో అధికారుల నియామక పక్రియ చాలా పకడ్బందీగా ఉంటున్నా ఇలాంటి ఘటనలు జరుగుతుండటం దేశప్రతిష్టకు భంగకరంగానే భావించాలి. లోక్‌పాల్‌ సంస్థను ఏర్పాటు చేసి దాని ఆధ్వర్యంలో కేసులు దర్యాప్తు చేపట్టడం ద్వారా కేంద్రం తన నిజాయితీని నిరూపించుకోవాలి.