సిరిసిల్లకు చీకటి రోజులు తీసుకొచ్చారు
– తెరాస హయాంలో స్థానిక సంస్థలు నిర్వీర్యం
– మన ఊరు, మన ప్రణాళిక, గ్రామజ్యోతి పథకాలు ఎక్కడకుపోయాయి..?
– రేషన్‌షాపులను ఎత్తివేసేలా ప్రభుత్వం కుట్రచేస్తుంది
– మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్
కరీంనగర్,అక్టోబర్24(జనంసాక్షి) : సిరిసిల్లకు రాష్ట్ర ప్రభుత్వం చీకటి రోజులు తీసుకొచ్చిందని కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం ఆయన కరీంనగర్‌లో విలేకరులతో మాట్లాడారు. సిరిసిల్లను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో మంత్రి కేటీఆర్ సమాధానం చెప్పాలన్నారు. సిరిసిల్ల టెక్స్ టైల్స్ పార్క్ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్దమా.. అని ప్రశ్నించారు. అలాగే… నిన్న జరిగిన కేబినెట్ విూటింగ్ కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా ఉందని పొన్నం యద్దేవా చేశారు. కేవలం తెరాస క్యాబినెట్ సమావేశాలు ఏర్పాటు చేసి ఫొటోలకు ఫోజులివ్వటంతోనే సరిపుచ్చుతుందని, క్షేత్రస్థాయిలో వారు చర్చించి అంశాలు ఏ ఒక్కటి ఆచరణలో కనిపించటం లేదని ఆరోపించారు. గ్రామ పంచాయతీలను పటిష్ఠం చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. కాంగ్రెస్ హయాంలో గ్రామాలకు ప్రత్యేక నిధులను అందించామన్నారు. దీనికితోడు 14,13వ ఆర్థిక సంఘాల నిధులను నేరుగా గ్రామాలకే అందించామన్నారు. కానీ తెరాస ప్రభుత్వం కేంద్రం నుంచి వచ్చిన నిధులను కూడా పక్కదారి పట్టిస్తోందని, ఫలితంగా గ్రామాల్లో నిధులు లేక అభివృద్ధి కుంటుపడిపోయిందని దీనంతటికి తెరాస ప్రభుత్వంతీరే కారణమని విమర్శించారు.
టీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం స్థానిక సంస్థలను నిర్వీర్యం చేశారన్నారు. మన ఊరు-మన ప్రణాళిక, గ్రామజ్యోతి పథకాలు ఎక్కడికిపోయాయయని పొన్నం ప్రశ్నించారు. గ్రామజ్యోతివంటి పథకాలను హడావుడిగా ప్రవేశపెట్టి, కమిటీలను కూడా వేశారన్నారు. కేవలం మూడు నెలలు పర్యవేక్షణ చేసి వాటిని గాలికొదిలేసిందన్నారు. నిధులు ఇవ్వందని కమిటీలు మాత్రం ఏం చేస్తాయని, టీఆర్‌ఎస్ ప్రభుత్వం తీరుతో గ్రామాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెరాస పాలనలోకి వచ్చిన నాటి నుండి గ్రామాల్లోని రేషన్ షాపులను ఒక్కొక్కటిగా తొలగించుకుంటూ వస్తుందని, ఇప్పుడు కొత్త నిబంధనల పేరుతో మొత్తం షాపులనే ఎత్తివేయాలని చూస్తున్నారని, ఇందుకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామా చేయాలని పొన్నం డిమాండ్ చేశారు.
విధానపరమైన నిర్ణయం తీసుకునేటప్పుడు మంత్రి ప్రమేయం కూడా ఉండడం లేదని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ప్రభుత్వం తన తీరును మార్చుకోకపోతే రాబోయే కాలంలో తగిన గుణపాఠం తప్పదని పొన్నం హెచ్చరించారు.