సిరిసిల్లలో తెలంగాణవాదులపై దాడులు అమానుషం
నిజామాబాద్, జూలై 24 : చేనేత కార్మికుల సమస్యలపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధ్యక్షురాలు విజయమ్మ చేపట్టిన దీక్షలు రాజకీయ యాత్ర అని నిజామాబాద్ తెలంగాణ రాజకీయ జేఏసీ విమర్శించింది. మంగళవారం స్థానిక టిఎన్‌జివోస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా కన్వీనర్ గోపాలశర్మ మాట్లాడారు. వైఎస్ విజయమ్మ రాయలసీమ గుండాలతో సిరిసిల్లలో అడుగుపెట్టి అడ్డువచ్చిన తెలంగాణవాదులపై దౌర్జన్యం చేశారని ఆయన ఆరోపించారు. విజయమ్మ చేపట్టిన యాత్రకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పది వేల మంది పోలీసులతో బందోబస్తు కల్పించారని విమర్శించారు. ఈ దీక్షలను అడ్డుకున్న టిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేయించడం అమానుషమని తీవ్రంగా ఖండించారు. చేనేత కార్మికులపై చిత్తశుద్ధి ఉంటే వైఎస్ జగన్ సంపాదించిన లక్ష కోట్ల రూపాయల నుంచి కనీసం 3 నుంచి 4 వందల కోట్ల రూపాయలను మంజూరు చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వైఎస్ విజయమ్మ యాత్ర అడ్డుకోవడంలో తెలంగాణకు చెందిన కాంగ్రెస్ ఎంపిలు, ఎమ్మెల్యేలు, మంత్రులు విఫలమయ్యారని గోపాలశర్మ అన్నారు. కేవలం ఢిల్లీలో కూర్చొని పత్రికా ప్రకటనలకే పరిమితమవుతున్నారని విమర్శించారు. సిరిసిల్ల సంఘటనపై చంద్రబాబు స్పందించకపోవడం విచారకరమని, కాంగ్రెస్, వైఎస్‌ఆర్ కాంగ్రెస్, టిడిపితో కుమ్మక్కయ్యారని విమర్శించారు. అనంతరం ఎన్టీఆర్ చౌరస్తాలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నాయకుల దిష్టిబొమ్మలను దగ్ధం చేసి రాస్తారోకో చేశారు. విలేకరుల సమావేశంలో జేఏసీ నాయకులు వి.ప్రభాకర్, పోశెట్టి, ఉద్యోగ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.