సిరిసిల్ల,వేములవాడలపై బిజెపి నజర్
గెలుపు గుర్రాల కోసం నేతల కసరత్తు
మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటేలా యత్నాలు
సిరిసిల్ల,జూలై22(జనంసాక్షి): మున్సిపల్ ఎన్నికల్లో పట్టు సాధించాలని బిజెపి భావిస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో అధికార టీఆర్‌ఎస్ కంటే.. బీజేపీకి ఎక్కువ ఓట్లు రావడంతో ఆ పార్టీ నేతల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. యువకులు, మహిళల ఓట్లు వస్తాయనే ఆశతో బీజేపీ నేతలు అన్ని వార్డుల్లోనూ అభ్యర్థులను నిలిపేందుకు సిద్ధమయ్యారు. వేములవాడ పట్టణంలో అధికార పార్టీతోపాటు, బీజేపీ బలంగానే ఉండడంతో బీజేపీ టికెట్ల కోసం పోటీ నెలకొంది. సిరిసిల్లలో టీఆర్‌ఎస్ టికెట్లకు గిరాకీ పెరిగింది. పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ ఓట్లు సాధించడంతో బీజేపీ నేతల్లో ఆశలు పెరిగాయి. మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటుకోవాలని ఆ పార్టీ అగ్రనేతలు రంగం సిద్ధం చేశారు. సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలి టీల్లో బలమైన అభ్యర్థులను బరిలో దింపేందుకు ఆ పార్టీ నేతలు వ్యూహాలు రూపొందిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ జారీకి ముందే ఏ వార్డులో ఎవరిని బరిలో దింపాలి అనే అంశాన్ని ఆ పార్టీ ముఖ్య నాయకులు చర్చించుకుంటున్నారు. అధికార పార్టీలో టికెట్లు రాని వారికి, వార్డుల్లో మంచిపేరున్న
అభ్యర్థులకు టికెట్లు ఇవ్వాలని బీజేపీ భావిస్తోంది. సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో చాలా వార్డుల్లో అధికార టీఆర్‌ఎస్‌లో టికెట్ల కోసం పోటీ అధికంగా ఉండగా.. అసంతృప్తి నాయకులకు టికెట్లు ఇచ్చేందుకు ఆ పార్టీ రెడీగా ఉంది. ఇప్పటికే కొందరు మాజీలు, సిట్టింగులు కమలం నేతలతో టచ్‌లో ఉంటున్నారు.
మరోవైపు ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు వేంగంగా జరుగుతున్నాయి. వారంరోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ జారీ కానుంది. సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో ఎన్నికలబరిలో నిలిచేందుకు అభ్యర్థులు సిద్ధమవుతున్నారు. బస్తీ ఎన్నికల్లో గెలిచే అభ్యర్థుల వేటలో అన్ని పార్టీల నేతలు తలమునకలయ్యారు. సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో మున్సిపల్ వార్డుల సంఖ్య పెరగడంతో అన్ని పార్టీలూ కొత్త వార్డుల్లో అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో పడ్డాయి. గతంలో పార్టీ టికెట్‌పై పోటీ చేసి గెలిచిన అభ్యర్థులు పార్టీ మారగా.. ఈసారి కొత్త వారితో ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. సిట్టింగ్‌లకు మరో చాన్స్ ఇస్తూనే కొత్త వారితో పురపోరుకు వెళ్లాలని కాంగ్రెస్ భావిస్తోంది. టిక్కెట్ ఎవరికి ఇచ్చినా గెలిపించుకోవాల్సిందే అన్న కెటిఆర్ సూచనల మేరకు పార్టీ యంత్రాంగం పనిచేస్తోంది. ఇటీవల పర్యటించిన కెటిఆర్ టిక్కెట్ ఎవరికి ఇచ్చినా మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించాలన్నారు. మరోవైపు ప్రస్తుతం సిట్టింగ్ కౌన్సిలర్లకు టికెట్ల దడపట్టుకుంది. క్షేత్రస్థాయిలో సర్వేలు నిర్వహిస్తూ.. ఎన్నికల్లో రేసుగుర్రాలను ఎంపిక చేయాలని పార్టీలు భావిస్తున్నాయి. అంగ, అర్థబలం ఉన్న అభ్యర్థులను బరిలో దింపేందుకు పార్టీలు సిద్ధమవుతున్నాయి. సిరిసిల్లలో 33 మంది, వేములవాడలో 20 మంది సిట్టింగు కౌన్సిలర్లు ఉండగా.. వీరిలో సగం మందికి మళ్లీ టికెట్లు దక్కే అవకాశం లేదని భావిస్తున్నారు. క్షేత్రసాయిలో అభ్యర్థుల పని తీరు.. గెలుపు ఓటములపై అధికార పార్టీ నేతలు సర్వేలు నిర్వహిస్తున్నారు. ఆ సర్వే నివేదిక ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఏది ఏమైనా .. సిట్టింగు కౌన్సిలర్లను టికెట్ల భయం పట్టుకుంది. అధికార పార్టీ చేసిన అభివృద్ధి పనులు.. సొంత ఇమేజ్‌తో మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు సాధిస్తామని సిట్టింగుల్లో ఆశలు ఉన్నాయి. పార్టీ అధిష్టానం టికెట్లు ఇవ్వకుంటే ప్రత్యామ్నాయంపై సిట్టింగులు దృష్టిసారించారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ టికెట్లపై పోటీచేసి గెలిచిన అభ్యర్థులు కొందరు.. పార్టీని వదిలేసి అధికార టీఆర్‌ఎస్‌లో చేరారు. కండువా మార్చిన కౌన్సిలర్లకు మళ్లీ పార్టీ టికెట్లు ఇస్తామని ఆ పార్టీ ముఖ్యనేతలు మాట ఇచ్చారు. అదేవార్డులో టీఆర్‌ఎస్ టికెట్‌పై పోటీచేసి ఓడిపోయిన అభ్యర్థులు క్షేత్రస్థాయిలో సానుభూతి ఓట్లపై ఆశలు పెట్టుకోగా.. పార్టీ మారిన సిట్టింగ్ కౌన్సిలర్లకు అవకాశం ఇస్తే.. మా సంగతి ఏంది..? అని అప్పట్లో ఓడిపోయిన నాయకులు బెంగపడుగున్నారు. సిట్టింగ్ కౌన్సిలర్లపై వ్యతిరేకత ఉన్న వార్డుల్లో కొత్తవారికి అవకాశం ఇవ్వాలని అధికార పార్టీ భావిస్తోంది. విలీన గ్రామాల్లోనూ పలుబడి ఉన్నవ్యక్తుల్లో ఆర్థికంగా ఉన్న వారిని ఎంపిక చేయాలని చూస్తున్నారు.