సిర్పూర్ పేపర్ మిల్లు తెరుచుకుంటే మంచిదే
అలాగే మిగతా పరిశ్రమలపైనా దృష్టి పెట్టాలి : సిపిఐ
ఆదిలాబాద్,ఆగస్ట్1(జనంసాక్షి): తెలంగాణ ఏర్పడి, టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు దాటినా మూతపడ్డ ఒక్క పరిశ్రమకూడా తెరుచుకోలేదని సిపిఐ విమర్శించింది. పారిశ్రామిక రంగాన్ని తెరాస ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆయన క్ష్మి ధ్వజమెత్తారు. అలాగే జిల్లాలో ఉన్న సిర్పూర్ పేపర్ మిల్లును తెరిపించేందుకు చేస్తున్న ప్రయత్నాలను హర్షించాల్సిందేనని సిపిఐ జిల్లా నాయకుడు కలవేన శంకర్ అన్నారు. అధికారంలోకి వస్తే మూతబడిన పరిశ్రమలను తెర్పించి కార్మికులకు ఉపాధి కల్పిస్తామన్న తెరాస నాయకుల హావిూలు నేటికీ అమలుకు నోచుకోలేదని విమర్శించారు. కార్మికుల హక్కుల సాధన కోసం సీపిఐ పోరాటం చేస్తోందన్నారు. సిర్పూరుకాగితపు పరిశ్రమతో పాటు , సీసీఐ,జిన్నింగ్ మిల్లులను తెరిపించాలని అన్నారు. కార్మిక సంక్షేమం అంటే పరిశ్రమలు మూతబడేయడం, పట్టించుకోకపోవడమేనా అని ప్రశ్నించారు. ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంటే వాటిపై ఆధారపడిన కార్మికులు ఎలా బతకాలన్నారు. వారి బాధలు ఈ ప్రభుత్వానికి పట్టావా అని ప్రశ్నించారు. కార్మికులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సవతితల్లి ప్రేమను చూపుతున్నాయని దుయ్యబట్టారు. కార్మిక హక్కులను ఈ పాలకులు కాలరాస్తున్నారని ఆరోపించారు. మూతబడిన పరిశ్రమలను పునరుద్ధరించేలా పోరాటాలు చేసి ప్రభుత్వం మెడలు వంచడానికి కార్మికులు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు.