సిర్పూర్ పేపర్ మిల్లు పునఃప్రారంభం
– నాలుగేళ్ల కార్మికుల నిరీక్షణకు తెరదించిన మంత్రి కేటీఆర్
– పూజలు నిర్వహించి ప్రారంభించిన మంత్రి
– వచ్చే డిసెంబర్ కల్లా మిల్లులో ఉత్పత్తి జరుగుతుంది
– ఉద్యోగులకు దశలవారీగా అన్ని విధాల రాయితీలు అందిస్తాం
– పరిశ్రమలను కాపాడుకునే బాధ్యత కార్మికులదే
– సీఎం కేసీఆర్ సంకల్పంతోనే పేపర్ మిల్లు పునరుద్దరణ సాధ్యమైంది
– ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్
కుమ్రంభీం ఆసిఫాబాద్, ఆగస్టు2(జనం సాక్షి) : నాలుగేళ్ల కార్మికుల నిరీక్షణకు తెరపడింది. సిర్పూర్ పేపర్ మిల్లుకు ప్రత్యేక పూజలు నిర్వహించి గురువారం ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఈ పేపర్ మిల్లుపై ఆధారపడిన కార్మికుల శ్రేయస్సు కోసమే సిర్పూర్ పేపర్ మిల్లును పునః ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఈ పేపర్ మిల్లు విూద ప్రత్యక్షంగా, పరోక్షంగా 10వేల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయన్నారు. గత నాలుగేళ్ల నుంచి కార్మికులు అనేక కష్టాలు పడ్డారని, కార్మికుల బాధలను చూసిన ఎమ్మెల్యే కోనేరు కొనప్ప పేపర్ మిల్లును పునరుద్ధరణ చేయించేందుకు ఎంతో కృషి చేశారన్నారు. కోనేరు కొనప్ప కృషిని అందరూ అభినందించాలని కేటీఆర్ పేర్కొన్నారు. వచ్చే డిసెంబర్ కల్లా సిర్పూర్ పేపర్ మిల్లులో ఉత్పత్తి జరుగుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు. పేపర్ మిల్లు ఉద్యోగులకు దశల వారీగా అన్ని విధాల రాయితీలు అందిస్తామన్నారు. పరిశ్రమలను కాపాడుకునే బాధ్యత కార్మికులదే అని మంత్రి స్పష్టం చేశారు. కొత్త పరిశ్రమలను తెస్తున్నామని, మూతపడ్డ పరిశ్రమలను పునరుద్ధరిస్తున్నామని తెలిపారు. సీఎం కేసీఆర్ సంకల్పంతోనే పేపర్ మిల్లు పునరుద్ధరణ సాధ్యమైందన్నారు. ఏమి చేసైనా సరే మిల్లు తెరిపించాలని సీఎం ఆదేశించారు. మిల్లును టేకోవర్ చేసిన జేకే గ్రూప్‌కు రూ. 30 వేల కోట్ల టర్నోవర్ ఉందన్నారు. ఉపాధి కల్పన జరిపించేందుకు పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. తెలంగాణకు పరిశ్రమలు తెచ్చిన తర్వాత కొంతమంది కార్మిక నాయకులు.. తమ స్వార్థాల కోసం కార్మికుల్లో విబేధాలు సృష్టిస్తున్నారన్నారు. ఇలాంటి పనులు చేయవద్దని కార్మిక సంఘాలను కోరుతున్నానని కేటీఆర్ తెలిపారు. పేపర్ మిల్లు పునరుద్ధరణ కోసం యాజమాన్యానికి అన్ని విధాలా అండగా ఉంటామని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇంటింటికీ సురక్షిత మంచినీరును అందివ్వబోతున్నామని చెప్పారు. రాష్ట్రంలో ప్రతి ఎకరాకు సాగునీరు ఇవ్వడానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెరాస నేతలు, తదితరులు పాల్గొన్నారు.
—————————————