సివిల్‌ ఫలితాలు విడుదల

3

– సత్తా చాటిన మహిళలు

న్యూఢిల్లీ,జులై4(జనంసాక్షి):

యూపీపీఎస్సీ శనివారం మధ్యాహ్నం విడుదల చేసిన సివిల్స్‌ ఫలితాల్లో మహిళలు ముందున్నారు.  టాప్‌ 5లో ఏకంగా నలుగురు మహిళలు స్థానం దక్కించుకోవడం ఇందుకు నిదర్శనం. ఇరా సింగాల్‌, రేణు రాజ్‌, నిధి గుప్తా, వందనరావ్‌లు టాప్‌ 5లో నిలిచారు. 2014 ఆగస్టు 24న జరిగిన సివిల్స్‌ పరీక్షలకు సంబంధించిన ఫలితాలు శనివారం మధ్యాహ్నం విడుదలయ్యాయి. వైకల్యాన్ని అధిగమించి సివిల్స్‌లో మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది ఓ వికలాంగురాలు. నేటి సివిల్స్‌ టాపర్‌ ఇరా సింఘాల్‌ గతంలో సివిల్స్‌ సర్వీసెస్‌లో ఐఆర్‌ఎస్‌ సాధించినప్పటికీ అంతటితో ఆగలేదు. ఐఏఎస్‌ కోసం శ్రమించారు. ఫలితం పొందారు.  సివిల్స్‌ ఫలితాల్లో ఢిల్లీకి చెందిన ఇరా సింఘాల్‌ మొదటి స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా ఇరా మాట్లాడుతూ.. మొదటి ర్యాంకు వస్తుందని ఊహించలేదు. వికలాంగుల కోసం కృషి చేస్తాను. సివిల్స్‌ టాపర్‌గా నిలవడం సంతోషంగా ఉందని తెలిపారు. సివిల్స్‌ టాప్‌ 100లో తెలంగాణ ఆణిముత్యం మెరిసింది. వరంగల్‌ జిల్లాకు చెందిన సతీష్‌రెడ్డి పింగెళి 97వ ర్యాంకు సాధించారు. సతీష్‌రెడ్డికి 97వ ర్యాంకు రావడంతో ఆయన తల్లిదండ్రులు ఆనందంలో మునిగిపోయారు. స్వీట్లు పంచుకున్నారు. తమ కుమారుడు సివిల్స్‌ సర్వీసెస్‌కు ఎంపికవడం సంతోషంగా ఉందన్నారు.  తెలుగువారు పలు ర్యాంకులు సాధించారు.  సివిల్స్‌-2014 ఫలితాల్లో విజయం సాధించిన వారికి ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్‌ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి సేవ చేయడానికి ప్రయాణం ప్రారంభిస్తున్న వారికి శుభాకాంక్షలు అంటూ మోదీ ట్వీట్‌ చేశారు. సివిల్స్‌ పరీక్షలో ఉత్తీర్ణత పొందని వారికి ఇది కేవలం జీవితంలో ఓ భాగమని, భవిష్యత్‌ ప్రణాళికలను ఇది అడ్డుకోకూడదని చెప్పారు