సీఎంగా ప్రమాణం చేయనున్న మెహబూబా ముఫ్తీ…

శ్రీనగర్ : జమ్ము-కశ్మీర్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుంది. పీడీపీ నాయకురాలు మెహబూబా ముఫ్తీ ఈనెల 4న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జమ్ము-కశ్మీర్‌ ముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్ సయీద్‌ మరణం తర్వాత.. మెహబూబా పార్టీ పగ్గాలు చేపట్టినప్పటికీ… ప్రభుత్వం ఏర్పాటుకు ముందుకు రాలేదు. దీంతో అక్కడ రాష్ట్రపతి పాలన విధించారు. ఇప్పుడు బీజేపీతో సయోధ్య కుదుర్చకున్న పీడీపీ.. సంకీర్ణ సర్కార్‌ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. మెహబూబా ముఫ్తీని పీడీపీ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. ప్రభుత్వం ఏర్పాటు  విషయాన్ని మెహబూబా ముఫ్తీ… రాష్ట్ర గవర్నర్‌ వోహ్రా దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రపతి పాలన తొలగించడానికి వీలుగా ఆయన కేంద్రానికి నివేదిక పంపాల్సి ఉంది. ప్రధాని మోదీ విదేశీ పర్యటన నుంచి తిరిగొచ్చిన తర్వాత జరిగే కేబినెట్‌ భేటీలో రాష్ట్రపతి పాలన తొలగిస్తూ నిర్ణయం తీసుకుంటారు. దీనికి రాష్ట్రపతి ఆమోదం తెలిపిన  తర్వాత మెహబూబా ముఫ్తీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఉపముఖ్యమంత్రిగా నిర్మల్‌సింగ్‌ బాధ్యతలు చేపడతారు.