సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి హామీలను నిలబెట్టుకోవాలి
భద్రాచలం టౌన్: ఈనెల 5న జిల్లాకు వస్తున్న ముఖ్యమంత్రి జిల్లా వాసులకు గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా ప్రకటన చేయాలని ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణ డిమాండ్ చేశారు. గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇల్లెందు పర్యటనకు వస్తున్న సీఎం గతంలో గిరిజనులకు హామీలను ఇప్పటికైనా నెరవేర్చాలని కోరారు. గతంలో ఇందిరమ్మ బాట కార్యక్రమంలో వర రామచంద్రపురం మండలం సున్నవారిగూడెంలో సీఎం దాదాపు రూ. 62కోట్ల అభివృద్ధి పనులకు హామీ ఇచ్చారని అన్నారు. పోలవరం ముంపు బాధితులకు పొరుగు జిల్లాలైన పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి ముంపు బాధితులతో సమానంగా నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెదేపా రాష్ట్ర నాయకులు యశోధ రాంబాబు, మండల నాయకులు మువ్వా శ్రీనివాస్, తోటకూర రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు.