సీఎం కేసీఆర్ చైనా పర్యటనలో మార్పు
హైదరాబాద్,సెప్టెంబర్5(జనంసాక్షి):
ముఖ్యమంత్రి చైనా పర్యటనకు రంగం సిద్దం అయ్యింది. ఇప్పటికే అధికరాఉలు అక్కడికి వెళ్లి సిఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షిస్తుండగా, సిఎం చంద్రశేఖర్ రావు షెడ్యూల్ కంటే ఒక రోజు ముందుగానే చైనా పర్యటనకు వెళ్లనున్నారు. ఈ మేరకు ఆయన పర్యటనలో స్వల్ప మార్పులు చేశారు. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 8న కేసీఆర్ బృందం చైనాకు వెళ్లాల్సి ఉండగా, ఓ రోజు ముందుగా అంటే 7వ తేదీన బయల్దేరి వెళ్లనుంది. కేసీఆర్ వెంట మంత్రులు, అధికారులతో కూడిన ఉన్నత స్థాయి బృందం వెళ్లనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే కొంత మంది అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేయటానికి చైనా బయలుదేరి వెళ్లారు. చైనా తన పర్యటనలో వరల్డ్ ఎకనమిక్ ఫోరం సమావేశంలో పాల్గొనటంతో పాటు వివిధ పారిశ్రామిక సంస్థల ప్రతినిధులతో భేటీ అయి తెలంగాణ రాష్టాన్రికి పెట్టుబడులు సాధించేందుకు చర్చలు జరిపే అవకాశం ఉంది.ముఖ్యంగా హార్డ్ వేర్ రంగానికి చెందిన ప్రతినిధులతో సమావేశం కానున్నారు. సీఎంతో పాటు చైనా పర్యటనకువ వెళ్లే వారిలో శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, అసెంబ్లీ స్పీకర్ మధుసూదనా చారి, మంత్రులు జూపల్లి కృష్ణారావు, జగదీశ్వర్ రెడ్డి తదితరులు ఉన్నారు. వరల్డ్ ఎకనామిక్ సదస్సులో కేసీఆర్ బృందం పాల్గొననుంది. చైనాలో బీజింగ్, షాంఘై, షెంజాన్ నగరాల్లో పర్యటిస్తారు. ముఖ్యమంత్రి ప్రత్యేక విమానంలో చైనా పర్యటనకు వెళుతున్నారు. దీని కోసం సర్కారు ఇఫ్పటికే రెండు కోట్లకు పైగా నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది