సీఎం కేసీఆర్ విజన్ మేరకు పనిచేయాలి
– ప్రతివిభాగం పురోగతి, భవిష్యత్ ప్రాధాన్యతలపై నివేదికలు ఇవ్వండి
– పురపాలక శాఖ విభాగాధిపతులతో సవిూక్షలో మంత్రి కేటీఆర్
హైదరాబాద్, సెప్టెంబర్9 (జనం సాక్షి ) : సీఎం కేసీఆర్ ఆలోచనలు, విజన్ మేరకు ప్రతీ ఒక్కరూ ముందుకెళ్లాలని, ప్రజలకు మేలు జరిగేలా పనిచేయాలని పురపాలక, ఐటీశాఖల మంత్రి కేటీఆర్ అన్నారు.
రెండవసారి పురపాలక శాఖ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం సోమవారం పురపాలకశాఖ విభాగాధిపతులతో మంత్రి కేటీ రామారావు సవిూక్ష నిర్వహించారు. మసాబ్ ట్యాంక్ లోని పురపాలక శాఖ కార్యాలయంలో జరిగిన ఈ సవిూక్షా సమావేశంలో పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్, పురపాలక సంచాలకులు శ్రీదేవి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, జలమండలి ఎండీ దానకిషోర్ లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈసందర్భంగా మంత్రి కేటీఆర్.. ప్రస్తుతం ఆయా విభాగాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. దీంతోపాటు ప్రస్తుతం ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతలపైన మంత్రి విభాగ అధిపతులకు దిశానిర్దేశం చేశారు. ఒకటి రెండురోజుల్లో మళ్లీ సమావేశం అవుతానని తెలిపారు. ప్రతివిభాగం తన కార్యక్రమాల పురోగతి, భవిష్యత్తు ప్రాధాన్యతలపైన ఒక నివేదిక సమర్పించాలని కోరారు. రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి అలోచనలు, విజన్ మేరకు పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా నూతనంగా పదవీభాద్యతలు చేపట్టిన మంత్రి కేటీఆర్కు మొక్కను అందజేసి విభాగాధిపతులు శుభాకాంక్షలు తెలిపారు.