సీఎం కేసీఆర్ చలవతోనే మైనార్టీలకు 100శాతం సబ్సిడీపై రుణాలు

ముస్లింలు బీఆర్ఎస్ పక్షానే ఉండాలి.. సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపర్చాలి

ఎవరూ అధైర్య పడకండి..మైనార్టీ బందు నిరంతర ప్రక్రియ..

అందరికీ సాయం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది..

దారుస్సలాంలో మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్ ఇసాఖ్ కు ఆత్మీయ సత్కారం

కరీంనగర్, సెప్టెంబర్ 07:-

మైనారిటీ బందు పథకం ద్వారా ముస్లింలకు, క్రిస్టియన్లకు 100% సబ్సిడీ ద్వారా లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని, అందుకే దేశంలోనే నెంబర్ వన్, ఆదర్శ ముఖ్యమంత్రిగా సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారని తెలంగాణ రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్ ఇస్ హాఖ్ అన్నారు. గురువారం జగిత్యాల పర్యటనకు వెళుతున్న సందర్భంగా కరీంనగర్ ఎంఐఎం కార్యాలయం దారుస్సలామ్ లో కాసేపు ఆగారు. మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ మిత్రుడైన ఎంఐఎం నగర అధ్యక్షుడు, తెలంగాణ హజ్ కమిటీ సభ్యుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ ఇచ్చిన తేనేటి విందుకు హాజరయ్యారు. ఈసందర్భంగా గులాం అహ్మద్ హుస్సేన్ తో పాటు, ఎంఐఎం కార్పొరేటర్లు, నగర ఎంఐఎం కమిటీ నుండి చైర్మన్ ఇంతియాజ్ ఇస్ హాఖ్ కు ఆత్మీయ సత్కారం చేశారు. ఈసందర్భంగా చైర్మన్ ఇంతియాజ్ మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్, ఎంఐఎం అధినేత బారిష్టర్ అసదుద్దీన్ ఒవైసీ చలువ వల్లనే నేడు మైనార్టీ బందు పథకానికి అంకురార్పణ జరిగిందని, ముస్లింలు, క్రిస్టియన్ లు బిఆర్ఎస్ పార్టీకి అండగా నిలబడాలని కోరారు. అర్హులైన అందరికీ మైనారిటీ బందు ద్వారా లక్ష రూపాయల ఆర్థికసాయాన్ని ప్రభుత్వం అందిస్తున్నదని త్వరలో రెండో విడత చెక్కులను అందిస్తామన్నారు. మైనార్టీ బందు అనేది నిరంతర ప్రక్రియగా కొనసాగించాలని, దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు చెప్పారు. పేద మధ్యతరగతి ముస్లింలు వ్యాపారం చేసుకొని తన కాళ్ళ మీద నిలబడి, ఉన్నతంగా జీవించాలన్నదే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, బారిష్టర్ అసదుద్దీన్ ఒవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీల ఆలోచన విధానమని పేర్కొన్నారు. ఎవరు అధైర్య పడవద్దని, విడుతల వారీగా అందరికీ మైనార్టీ బంధు పథకం ద్వారా ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం నిరంతరంగా కృషి చేస్తున్నదని తెలిపారు. ఇంత కృషి పట్టుదలతో ముస్లింల క్రిస్టియన్ల పక్షపాతిగా నిలబడ్డ సీఎం కేసీఆర్ ను టిఆర్ఎస్ పార్టీని ముస్లింలు ఆదరించాలని అక్కున చేర్చుకోవాలని కోరారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని, కరీంనగర్ లో మంత్రి గంగుల కమలాకర్ ను ఎమ్మెల్యే గా, బోయిన్పల్లి వినోద్ కుమార్ ను ఎంపీగా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ముస్లిం సమాజానికి పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో ఎంఐఎం నగర అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్, నాయకులు అబ్బాస్ సమీ, బర్కత్ అలీ, మొయిజుద్దీన్ ఖాద్రి యూసుఫ్, ఖాజా, ఖమరుద్దీన్, ఇబ్రహీం, కార్పొరేటర్ ఫిరోజ్ అఖీల్, నాయకులు ఆతిన, అలిబాబా, అజర్ దబీర్, సాజిద్, కాజమ్ ఖాన్, అంజద్ ఖాన్, ఫరాజ్, కరీంఖాన్, ఖమర్, షేక్ రహీం, ఖదీర్, యాఖూబ్, సుధాకర్, ఖాలీద్, అహ్మద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు