సీఎం లైంగికంగా వేధించారు: లేఖలో సరిత సంచలనం

hwyej0d6తిరువనంతపురం: కేరళ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సోలార్ కుంభకోణంలో నిందితురాలిగా ఉన్న సరితా నాయర్ గతంలో రాసిన ఓ లేఖ వెలుగులోకి రావడం అక్కడ కలకలం రేపింది. గతంలో సీఎం ఉమెన్ చాందీ కుమారుడు తనను లైంగికంగా వేధించాడని ఆరోపించిన ఆమె, ఈ లేఖలో కొడుకుతో పాటు తండ్రి కూడా వేధింపులకు పాల్పడ్డారని రాసింది. తనను ఉమెన్ చాందీ లైంగికంగా వేధించారని ఆమె రాసిన లేఖ కాపీని ఆసియన్ నెట్ న్యూస్ ఛానల్ వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ లేఖ కాపీపై ఆసియన్ నెట్ న్యూస్ చానల్ ప్రత్యేక కథనాలను ప్రసారం చేస్తోంది. 2013, మార్చి 19న రాసినట్టుగా చెబుతున్న ఈ లేఖలో అనేక సంచలనాత్మక విషయాలు బయటపడ్డాయి. తాను ముఖ్యమంత్రికి లంచం కూడా ఇచ్చానని ఈ లేఖలో ఆమె తెలిపారు. దీనిపై ఆమె స్పందన కోరగా… ఈ లేఖ తనదేనని సరితా నాయర్ తెలిపారు. ‘ఆ లేఖ నాదే. పోలీసు కస్టడీలో ఉండగా రాశాను. అందులోని విషయాల గురించి చర్చించాలనుకోవడం లేదు. కానీ లేఖలో నేను రాసివన్నీ వాస్తవాలే’ అని అన్నారు.

అంతేకాదు ఉమెన్ చాందీతో పాటు కేంద్ర మాజీ మంత్రి తనను లైంగికంగా వేధించారని లేఖలో సరిత పేర్కొన్నారు. ఈ లేఖను అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్‌కు ఆమె ఇవ్వాలనుకున్నారు. ముఖ్యమంత్రి చాందీపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం ఇదే మొదటిసారి. దీనిపై స్పందించిన ఉమెన్ చాందీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తనపై పథకం ప్రకారం కుట్ర చేశారని ఆరోపించారు. ఎన్నికళ వేళ.. తన ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు శత్రువర్గం చేస్తున్న తుది ప్రయత్నమే ఇదని అన్నారు. ఇలాంటి ఆరోపణలను పట్టించుకోబోనని తెలిపారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరుపుతామని అన్నారు. కేరళలో సంచలనం సృష్టించిన సోలార్ కుంభకోణంలో సరితా నాయర్ సహ నిందితురాలిగా ఉన్నారు. ఈ కుంభకోణం వెలుగు చూసినప్పటి నుంచి ఆమె కేరళ రాజకీయాల్లో కేంద్ర బిందువుగా మారిపోయారు.